కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలను ప్రకటించింది. లెక్కింపు కేంద్రాల్లోని కౌంటింగ్ ఏజెంట్లకు ఫారం 17సీ ఇవ్వడంతో పాటు, వారికి వేళకు తగిన ఆహారం అందించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన సూచనల పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఫారం 17సీ తప్పకుండా అందిస్తామని చెప్పారు. లెక్కింపు కేంద్రం లోపల ఎన్ని టేబుళ్లు ఉంటే అంతమంది కౌంటింగ్ ఏజెంట్లను అనుమతిస్తామని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఎప్పటికప్పుడు ఆహారం అందిస్తామని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ద్వివేది స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ స్పష్టం చేసారు. తప్పదనుకుంటే కౌంటింగ్ తరువాత కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. మరి కొద్ది గంటల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల సంఘం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో ఈ నెల 27వ తేదీ అర్దరాత్రి వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేసారు. ఇదే సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో వీవీప్యాట్ లెక్కలో తేడా వచ్చినా, మిగతా లెక్కింపులో పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం అతి తక్కువగా ఉంటే రీపోలింగ్‌కు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఫలితం ఎటూ తేలకపోతే ఈసీకి విచక్షణాధికారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఫలితాల వెల్లడిలో ఆర్వోలదే తుది నిర్ణయమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేసారు.
ఏపీలో టీడీపీ..వైసీపీ మధ్య కౌంటింగ్ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రెండు పార్టీలు తమ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ పూర్తి చేసారు. అయితే, ఓట్లు తక్కువ వచ్చినా..ఓడిపోయే పరిస్థితి కనిపించినా వెంటనే రీ పోలింగ్‌కు డిమాండ్ చేయాలని టీడీపీ తమ ఏజెంట్లకు స్పష్టం చేసింది. వైసీపీ ముఖ్య నేతలు సైతం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కౌంటింగ్ సమయానికి ఏపీకీ కేంద్ర బలగాలను తరలించాలని విజ్ఞప్తి చేసారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఎన్నికల సంఘానికి వైసీపీ మీద ఫిర్యాదు చేసారదు. కౌంటింగ్ సమయంలో వైసీపీ అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని..చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏపీకి పది కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నట్లు సమాచారం.