వీవీప్యాట్ల అంశంలో ప్రతిపక్షాలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఓట్ల లెక్కింపు సమయంలో తొలుత అయిదు వీవీప్యాట్లను లెక్కించాలంటూ విపక్షాలు చేసిన డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదని, వీవీప్యాట్లను మొదట లెక్కించడం కుదరదని తేల్చి చెప్పింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఓట్ల లెక్కింపు జరుగుతుందని స్పష్టం చేసింది. లెక్కింపు సమయంలో వీవీప్యాట్లను తొలుత లెక్కించాలని, అందులో ఏ ఒక్క దాంట్లో తేడా వచ్చినా ఆ నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్లను లెక్కించేలా మార్గదర్శకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేతలు నిన్న ఎన్నికల సంఘాన్ని కలిసి విషయం తెలిసిందే.
రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, ఏపీ, రాజస్థాన్, దిల్లీ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, అశోక్‌గహ్లోత్, అరవింద్ కేజ్రీవాల్‌ల నేతృత్వంలో 22 రాజకీయ పార్టీలు మంగళవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి 11 పేజీల వినతిపత్రం అందజేశాయి. దీనిపై బుధవారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈసీ తెలిపింది. ఈ మేరకు నేడు సమావేశమైన ఎన్నికల సంఘం.. విపక్షాల డిమాండ్‌ను తిరస్కరించింది. మరో పక్క రాష్ట్రం విషయానికి వస్తే, తొలుత పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్లు లెక్కించి ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల లెక్కింపు చేపడతామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు.
మధ్యాహ్నం 12గంటల లోపు ఫలితాల ట్రెండ్స్ తెలిసిపోతాయన్నారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు తర్వాతే ఫలితం ప్రకటిస్తామని ద్వివేది స్పష్టంచేశారు. ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కిస్తామని స్పష్టంచేశారు. బుధవారం ఆయన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడుతూ.. ‘‘36 కౌంటింగ్ కేంద్రాల్లో సుమారు 350 లెక్కింపు హాళ్లు పెట్టాం. ప్రతి అసెంబ్లీ స్థానానికి ఒక పరిశీలకుడు, పార్లమెంట్ స్థానానికి మరో పరిశీలకుడు ఉంటారు. రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల ఆధ్వర్యంలో లెక్కింపు జరుగుతుంది. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాం. ఇప్పటికే లెక్కింపునకు ఏర్పాట్లన్నీపూర్తయ్యాయి. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలించేందుకు ఈసీఐ నుంచి ఇద్దరు పరిశీలకులు రాష్ట్రానికి వచ్చారు. వాళ్లు ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు’’ అని చెప్పారు.