పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక ఎగువ, దిగువ కాపర్ డ్యామ్ పనులను శుక్రవారం నుంచి నిలిపివేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుల బృందం మూడు రోజుల పాటు పునరావాస గ్రామాల్లో నిర్మాణాలు పరిశీలించారు. పునరావాసాల నిర్మాణం, ఆర్ అండ్ ఆర్ పరిహారాల విషయం, ఎగువ, దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణాల విషయంలో సంపూర్ణ నివేదికను కేంద్ర జలమండలికి అందజేయనున్న నేపథ్యంలో ఎగువ, దిగువ కాపర్ డ్యాం పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యులు సూచించారు. ప్రాజెక్టులో స్పిల్ వే స్పిల్ చానల్ పనులు మాత్రం జరగవలసి ఉండగా ఆ పనులు మందకొడిగా నడుస్తున్నాయి. పనులు నిలిచిపోవడంతో ప్రాజెక్టు ప్రాంతం నిర్మానుష్యంగా మారింది.
ప్రాజెక్టులో పనిచేసే భారీ వాహనాలు, యంత్రాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. క్రషర్లు, టెలీ బెల్ట్ యంత్రాలు, కాంక్రీట్ మిక్సర్లు యంత్రాలు కూడా నిలిచిపోయాయి. మరికొన్ని భారీ వాహనాలు ఒక్కొక్కటిగా ప్రాజెక్టు ప్రాంతం నుంచి బయటికి తరలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో కీలక పనులు నిర్వహించే భారీ వాహనాలు బయటికి తరలి వెళ్లిపోవడం పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముంపునకు సంబంధించిన కూడా రకరకాల సమాధానాలు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో పున పునరావాస ఏర్పాట్లు పూర్తయ్యే వరకు కాఫర్ డ్యామ్ పనులను నిలిపివేయాలన్న నిర్వాసితుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని పోలవరం అథారిటీ నిర్ణయించింది. ఈ మేరకు సమావేశం నుండే క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నాం నుండి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులను అధికారులు నిలిపివేశారు.
పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 1877 కోట్ల రూపాయలు చెల్లించాలని కేంద్రానికి ప్రతిపాదించినట్లు పోలవరం ప్రాజెక్టు అధారిటీ సిఇఒ ఆర్‌కె జైన్ చెప్పారు. 2019 ఏప్రిల్ వరకు పోలవరం ప్రాజెక్టుకు రూ.16,418 కోట్లు ఖర్చుపెట్టారని, అందులో రూ.10,869 కోట్లు 2014 మార్చి నుంచి ఖర్చుపెట్టారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ.6727 కోట్లు విడుదల చేసిందని, మిగిలిన మొత్తం రూ.4142 కోట్లు చెల్లించాల్సి ఉందని అన్నారు. అయితే ప్రస్తుతానికి రూ.1887 కోట్లు చెల్లించేందుకు ప్రతిపాదనలు పంపిచామని తెలిపారు. ఇది కాక మరో రూ.1112 కోట్లు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని వాటికి సంబంధించిన బిల్లులు రాలేదని అన్నారు.