కొత్త ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై దృష్టి సారించింది. సాధారణ పరిపాలన శాఖ, సీసీఎల్‌ఏ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లాల వివరాలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా భౌగోళికంగా భిన్న పరిస్థితులు కలిగి ఉంది. డెల్టా, సముద్ర తీరం ఒకవైపు, మెట్టప్రాంతం మరోవైపు ఉంటుంది. జిల్లా మొట్టమొదట 1859 ప్రాంతంలో ఏర్పడింది. అప్పట్లో బందరు ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. తర్వాత 1904లో గుంటూరు జిల్లా నుంచి విడిపోయి కృష్ణా నది పేరుతో ఏర్పాటు అయింది. 1925లో కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాలను విడదీసి పశ్చిమ గోదావరి జిల్లాగా ఏర్పాటు చేశారు. దీంతో మూడు సార్లు జిల్లా స్వరూపం మారిపోయింది. ప్రస్తుతం ఉన్న జిల్లాను రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం కృష్ణా జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఏలూరు పార్లమెంటు పరిధిలో జిల్లాకు చెందిన రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంటు వారీగా ఏర్పాటు చేస్తే రెండు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలోకి వెళ్లనున్నాయి. మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక జిల్లాలో ఏడు నియోజకవర్గాలు మాత్రం పరిమితం కానున్నాయి. జిల్లాలో గత ఏడాది వరకు 50 మండలాలు ఉండేవి. విజయవాడ అర్బన్‌ మండలం పునర్విభజన చేసి నాలుగు మండలాలు ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 53 మండలాలుగా జిల్లా ఆవిర్భవించింది. విజయవాడ గుడివాడ, నూజివీడు, బందరు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. జిల్లా కేంద్రాన్ని మార్చాలని గత కొంతకాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. అధికారులు అంతా విజయవాడ నగరానికే పరిమితం అవుతున్నారు. జిల్లా కేంద్రం మూలకు ఉండటంతో ప్రజలు కలెక్టరేట్‌, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు వెళ్లేందుకు సమస్యగా ఉంది. అధికారులు సైతం అక్కడ నివాసం ఉండక అందుబాటులో ఉండటం లేదు. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీరామారావు పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉండేది. అదికూడా ప్రస్తుతం తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం భౌగోళికంగా రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

రెండు జిల్లాలుగా కృష్ణాను విభజిస్తే విజయవాడ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. మచిలీపట్నం పరిధిలో బందరు, పెడన, అవనిగడ్డ, పామర్రు, గన్నవరం, పెనమలూరు, గుడివాడ నియోజకవర్గాలు ఉండనున్నాయి. అయితే పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు, యనమలకుదురులు మచిలీపట్నం జిల్లాలోకి చేరనున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం మచిలీపట్నం జిల్లా పరిధిలోకి వెళుతుంది. నగరం పరిసరాల్లోని పెద్ద పంచాయతీలు మచిలీపట్నం పరిధిలోకి చేరుతాయి. విజయవాడ జిల్లా పరిధిలో తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ నగరం పరిధిలోని తూర్పు, మధ్య, పశ్చిమ నియోజకవర్గాలు ఉంటాయి. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. గత ఎన్నికలకు ముందే జరగాల్సి ఉన్నా.. కేంద్రం స్పందించలేదు. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గాలను పునర్విభజన చేయాలనే ప్రతిపాదన ఉంది. ఈసారి అది అమలు జరిగితే మళ్లీ స్వరూపం మారే అవకాశం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read