విజయవాడ నగరంలోని సాయికిరణ్ జ్యూయలరీ దుకాణంలో భారీ చోరీ జరిగింది. బందరురోడ్డులోని పటమట సమీపంలో ఉన్న ఈ దుకాణంలో శనివారం రాత్రి 2 నుంచి 3 గంటల మధ్య.. పక్కా ప్రణాళికతో ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డును ఆనుకునే బంగారం దుకాణం ఉంది. ముందువైపు నుంచి లోపలికి వెళ్తే.. సైరన్ మోగే ప్రమాదముందని పసిగట్టిన దొంగలు దుకాణం వెనుకవైపున నిర్మిస్తున్న ఇంటివైపు నుంచి దుకాణం వెనుక గోడకు రంద్రం పెట్టి లోపలికి చొరబడ్డారు. ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించగా మరో వ్యక్తి బయట ఉండి గ్లౌజులు, ఇతర పరికరాలు వారికి అందించినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుకాణం లోపలి కర్ర తలుపును నెట్టేందుకు ప్రయత్నించిప్పటికీ అది బలంగా ఉండటంతో తలుపునకు రంద్రం పెట్టి దుకాణంలోకి ప్రవేశించారు. అక్కడ సీసీ కెమేరా ఉండడాన్ని గుర్తించిన ఓ వ్యక్తి తమ వెంట తీసుకొచ్చిన ఆయుధంతో దాన్ని పగులగొట్టాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో యజమాని ఉదయమే తెరవలేదు. దుకాణం వెనక ఇంటి నిర్మాణం చేస్తున్న వ్యక్తి బంగారం దుకాణం వెనుకవైపు గోడకు రంద్రం ఉండటాన్ని గమనించి యజమానికి సమాచారం చేరవేశారు. షాపు యజమాని గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగాయి. 500 గ్రాముల బంగారు ఆభరణాలు, 15 కేజీల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లుగా గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.