కేంద్రంలో రెండోసారి సత్తా చాటిన బీజేపీ.. ఆంధ్రప్రదేశ్‌లో చతికిలపడింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ స్థానాల్లో ఒక్క సీటూ రాలేదు. పైగా డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగిన బీజేపీ రెండు లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావులు మంత్రులుగా కూడా పనిచేశారు. అయితే ఈ పొత్తును మొదటి నుంచీ వ్యతిరేకించిన పార్టీలోని ఒక వర్గం.. బీజేపీ సొంతంగా పోటీ చేసి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవని ఆనాడు బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆ విధంగానే ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కమలనాథులకు చేదు అనుభవం ఎదురైంది. తమకు దేశమే ముఖ్యమని, ఆ దిశగా చేసిన ప్రయత్నంలో మోదీకి రెండోసారి అవకాశం దక్కిందని బీజేపీలోని అసలైన పార్టీ వాదులు సంతృప్తి పడుతున్నారు.

bjp 25052019 1

పార్టీలోకి వలస వచ్చిన వారు మాత్రం డిపాజిట్లు రాక, తమకు ఎక్కడా విలువ ఉండదని పెదవి విరుస్తున్నారు. వాస్తవానికి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామన్న ప్రధాని మోదీ చివరి బడ్జెట్‌లో దానిని చేర్చలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకొచ్చింది. అక్కడ సుజనా, అశోక్‌గజపతిరాజు, ఇక్కడ కామినేని, పైడికొండల తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఆ విధంగా టీడీపీ-బీజేపీ బంధం తెగిపోయింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో సొంతంగా బలపడాలని భావించిన అధిష్ఠానం కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. ఈ ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభకు పోటీ చేసిన కన్నాకు డిపాజిట్‌ దక్కలేదు. రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ 60 ఏళ్లలో చేయని సాయం ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందని ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌షా, కేంద్రమంత్రులు గడ్కరీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, పీయూష్‌ గోయల్‌ తదితరులు ప్రచారానికి వచ్చి కేంద్రసాయంపై తలోమాట, తమకు తోచిన లెక్కలు చెప్పారు.

bjp 25052019 1

చివరకు రైల్వేజోన్‌ విషయంలో చేసిన ప్రకటననూ ప్రజలు విశ్వసించలేదు. బీజేపీని ఎక్కువగా ఆదరించిన విశాఖ (ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ) వాసులు.. ఈ ఎన్నికల్లోనూ కరుణిస్తారని భావించి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిని ఎంపీగా బరిలో దించారు. ఇక్కడ టీడీపీ, వైసీపీ, జనసేన మినహా బీజేపీ అభ్యర్థిని విశాఖ వాసులు గుర్తించలేదు. ఇదే వైఖరి 25 లోక్‌సభ, ఆ పార్టీ పోటీ చేసిన 174 అసెంబ్లీ స్థానాల్లోనూ కనిపించింది. పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉన్న విష్ణుకుమార్‌రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నాలుగోస్థానానికి పరిమితమయ్యారు. దీంతో ‘పొత్తు లేకుండా ఒంటరిగా ఆంధ్రప్రదేశ్‌లో గెలవలేం’ అని ఈ ఫలితాలను చూసిన కొందరు బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. 1999లోనూ టీడీపీతో పొత్తుపెట్టుకునే గెలిచామని గుర్తు చేస్తున్నారు. పొత్తు వద్దని వారించిన నేతలు మాత్రం మౌనం వహిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read