భారత సార్వత్రిక ఎన్నికలు సరిగ్గా తుది అంకానికి చేరుకుంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా న్యూస్ మ్యాగజైన్ ‘టైమ్’ సంచలన కథనం ప్రచురించింది. అమెరికాకు చెందిన ప్రముఖ వీక్లీ టైమ్ మ్యాగజైన్ కూడా ఈసారి భారత ఎన్నికలపై ప్రత్యేక అంతర్జాతీయ ఎడిషన్ తీసుకొచ్చింది. దీంతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోను కవర్ పేజీపై ప్రచురించింది. మే 20, 2019న వెలువడే టైమ్ మ్యాగజైన్ యూరప్, మధ్య ప్రాశ్చ్యం, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ పసిఫిక్ అంతర్జాతీయ ఎడిషన్లలో మోదీ కవర్‌స్టోరీ ప్రచురించింది. ‘‘భారతదేశ ప్రధాన విభజనకారి’’ అన్న శీర్షికతో మోదీ క్యారికేచర్‌ను కవర్‌పేజీపై ముద్రించింది. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మరో ఐదేళ్లు మోదీ ప్రభుత్వాన్ని భరించగలదా?’’ అని రచయిత అతిష్ తషీర్ ప్రశ్నించారు.
‘‘జనాకర్షక దిశగా పతనమైన గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైనా ఉంటే అది భారతదేశమే...’’ అంటూ ఈ కథనం ప్రారంభమవుతుంది. టర్కీ, బ్రెజిల్, బ్రిటన్, అమెరికా తదితర ప్రజాస్వామ్య దేశాల్లో మాదిరిగా భారత్‌లో ఈ జనాకర్షక రాజకీయం ముసురుకుంటున్నదని రచయిత పేర్కొన్నారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ లౌకికవాదాన్ని, ‘‘మోదీ హయాంలో ప్రబలుతున్న సామాజిక ‘‘ఉద్రిక్తత’’తో పోల్చుతూ ఈ కథనం సాగింది. దీంతో పాటు వందలాది మందిని బలిగొన్న గుజరాత్ అల్లర్లను కూడా ఈ ఆర్టికల్‌లో గుర్తుచేశారు. బీజేపీ హిందూత్వ రాజకీయాలే భారత ఓటర్లు నిలువునా చీలడానికి కారణమని రచయిత ప్రముఖంగా పేర్కొన్నారు. ‘‘2014 ఎన్నికల తర్వాత స్వాతంత్ర్య భారత రాష్ట్రాల ప్రాధమిక సిద్ధాంతాలు, దాని సమరయోధులు, మైనారిటీ స్థానం సహా దేశంలో ఆయన వ్యవస్థల మధ్య తీవ్ర అపనమ్మకాలు ఏర్పాడ్డాయి’’ అంటూ మోదీపై టైమ్ మ్యాగజైన్ విమర్శలు గుప్పించింది.
‘‘2014 ఎన్నికల తర్వాత స్వాతంత్ర భారత ప్రధాన లక్ష్యాలైన లౌకికవాదం, ఉదారవాదం, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి వాటిని చాలామంది అతిపెద్ద కుట్రలో భాగంగా చూస్తున్నారు...’’ అంటూ టైమ్ కథనం పేర్కొంది. 2002 గుజరాత్ అల్లర్లపై మౌనం దాల్చిన కారణంగా మోదీ ‘‘అల్లరి మూకలకు స్నేహితుడిగా మారారంటూ’’ రచయిత విమర్శించారు. గోహత్యలపైనా మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండడాన్ని కూడా టైమ్ మ్యాగజైన్ ప్రశ్నించింది. కాగా ఈ మ్యాగజైన్ మోదీని విమర్శించడం ఇదే తొలిసారి కాదు. 2012లో ఇదే మ్యాగజైన్ ప్రచురించిన ఓ కథనంలో... మోదీని వివాదాస్పద, ఒత్సాహిక, తెలివైన రాజకీయ నాయకుడిగా పేర్కొంది. కాగా తాజాగా ప్రచురితమైన ఈ కథనం ప్రతిపక్ష పార్టీలకు సరికొత్త ఆయుధంగా మారింది. ‘‘మీ గురించి అందరూ నిజం తెలుసుకోవాలి...’’ అంటూ అఖిల భారత మహిళా కాంగ్రెస్ మోదీకి ట్వీట్ చేసింది.