ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సెలవుపై వెళ్లారు. శనివారం నుంచి ఈ నెల 15 వరకు ఆయన సెలవు తీసుకున్నారు. ఈ నెల 16న ఆయన మళ్లీ సచివాలయానికి రానున్నారు. రాష్ట్ర కేబినెట్ నిర్వహణ కోసం స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసిన అజెండాను ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ)కి పంపారు. ఈసీఐ నుంచి అనుమతి వచ్చేందుకు మరో రెండ్రోజులు పట్టే అవకాశం ఉంది. కేబినెట్‌పై సోమవారం సాయంత్రానికి ఈసీఐ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేబినెట్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర కేబినెట్ భేటీ ఎజెండాలో పెట్టిన నాలుగు అంశాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆమోదానికి పంపాలని స్ర్కీనింగ్ కమిటీ నిర్ణయించింది.
గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఈ కమిటీ సమావేశమైంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డి, విపత్తు నిర్వహణ, పశుసంవర్ధక శాఖల కార్యదర్శులు వరప్రసాద్, శ్రీధర్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్ కరికాల వలవన్ హాజరయ్యారు. ఫణి తుఫాను, నీటి ఎద్దడి, ఉపాధి హామీ, ఎండలు, కరువు, పశుగ్రాసం అంశాలను కేబినెట్ భేటీలో చర్చించేందుకు స్ర్కీనింగ్ కమిటీ ఆమోదించింది. వీటిని ఎన్నికల సంఘం ఆమోదానికి పంపాలని తీర్మానించింది. ఆయా అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు జతచేసి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) గోపాల కృష్ణ ద్వివేదికి పంపారు. దీనిపై ద్వివేది కూడా స్పందించారు. ఎజెండా కాపీ తనకు వచ్చిన వెంటనే కమిషన్‌కు పంపానని తెలిపారు.
అలా వెళ్లిన ఎజెండాను ఈసీ ఆమోదిస్తేనే 14వ తేదీన కేబినెట్ భేటీ జరుగుతుంది. కేబినెట్ ఎజెండాలో పొందుపరచిన ఉపాధి హామీ అంశంలో పెండింగ్ నిధుల వ్యవహారం ప్రధానమైదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద కేంద్రం నుంచి రూ.1,800 కోట్లు రావలసి ఉంది. ఇందులో రూ.367 కోట్లకు కేంద్రం ఇటీవల రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. అవి ఇంకా రాష్ట్ర ఖాతాలో జమ కాలేదు. దీనికి సంబంధించి రాష్ట్ర వాటా కింద రూ.125 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఈ అంశాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ కేబినెట్ ఎజెండాలో ప్రస్తావించింది. ప్రస్తుతం నిధుల కొరత ఉన్న కారణంగా ఉపాధి హామీ నిధుల్లో రాష్ట్ర వాటా విడుదల చేయలేకపోయామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. కేంద్రం రిలీజ్ ఆర్డర్ ఇచ్చినా.. రాష్ట్ర ఖాతాలో జమ కావడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు. వారం రోజుల్లో ఈ చెల్లింపులు పూర్తి చేస్తామని వెల్లడించారు.