కడప జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోని ఒకానొక గ్రామంలో ఓ ప్రధాన పార్టీ ఓటుకు రూ.6వేల చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం. పైగా రెండు ప్రధాన పార్టీల తరపున ఒక్కో ఓటుకు మొత్తంగా రూ.11వేలు అందినట్లు తెలిసింది. ఇంత పెద్దఎత్తున డబ్బు పంపిణీ జరిగిన గ్రామం బహుశా రాష్ట్రంలో ఇదేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రేటు ఇంత స్థాయికి పెరగడానికి రెండు ప్రధాన పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం కారణమని ప్రచారం జరుగుతోంది. ఈ గ్రామం నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలంలో ఉంది. టీడీపీలో ఒక కీలక నేతకు ఇది స్వగ్రామం. వైఎస్ కుటుంబానికి సొంత మండలం. ఆ గ్రామంలో 1200 మంది ఓటర్లు ఉన్నారు.
గ్రామంలో తన పట్టు నిలుపుకొని మెజారిటీ సాధించడానికి అవతలి పార్టీ ఇచ్చిన దాని కంటే ఒక ఓటుకు రూ.1,000 అదనంగా ఇవ్వడం ఆ టీడీపీ నేత కొంతకాలంగా పాటిస్తున్నారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పక్షం ఒక ఓటుకు రూ.500 ఇచ్చింది. ఆయన తన గ్రామం వరకూ రూ.1,500 ఇచ్చారు. ఈసారి అనూహ్యంగా ప్రత్యర్థి పక్షం ఆ మండలంలో ఓటుకు రూ.2,500 పంచిందని సమాచారం. దాంతో టీడీపీనేత రూ.3వేలు చొప్పున ఇచ్చారని తెలిసింది. ఈ పరిణామాన్ని టీడీపీ నేత వర్గీయులు ఊహించలేదు. ప్రత్యర్థిపక్షం డబ్బు పంచాక టీడీపీ నేత వర్గీయులు తమలో తాము సమావేశం పెట్టుకొన్నారు. కొంతసేపు తర్జనభర్జన తర్వాత కష్టమైనా.. నష్టమైనా ఆనవాయితీ కొనసాగించేల్సిందేనని నిర్ణయించుకొన్నారు. ఆ ప్రకారం ఓటుకు రూ.4 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించుకుని అదే రోజు పంపిణీ చేశారు. ఈ విషయం తెలియగానే ప్రత్యర్థి పక్షం అప్పటికే తాము పంచిన రూ.3వేలకు అదనంగా మరో రూ.3 వేలు పంచింది. దీంతో ఆ పార్టీ ఒక్కో ఓటరుకు రూ.6వేలు పంచినట్లయింది.
దీనితో టీడీపీ నేత వర్గీయులు ఆశ్చర్యపోయారు. ప్రత్యర్థి పక్షం నుంచి ఇంత పంపిణీని వారు ఊహించలేదు. మళ్లీ సమావేశం పెట్టుకున్నారు. అంతకు ముందు ఇచ్చిన రూ.4వేలకు అదనంగా మరో రూ.వెయ్యి ఇచ్చారు. అంటే 5వేలు పంచారన్న మాట. ఇది గాక ప్రతి ఓటరుకు ఒక టోకెన్ ఇచ్చారు. గ్రామంలో టీడీపీకి మెజారిటీ వస్తే ఆ టోకెన్ వెనక్కి తీసుకుని రూ.2వేలు ఇస్తామని వాగ్దానం చేశారు. మెజారిటీ రాకపోతే ఆ 2వేలు ఇవ్వరు. టీడీపీకి మెజారిటీ వస్తే ఆ పార్టీ ఇచ్చే మొత్తం ఒకో ఓటరకు రూ.7వేలు అవుతుంది. లేకపోతే రూ.5వేలు అవుతుంది. ప్రత్యర్థి పక్షం వైసీపీ రూ.6వేలు ఇచ్చింది. ఆ గ్రామంలో ఓటర్లకు ఇరు పార్టీల నుంచి ఇప్పటికి ఓటుకు రూ.11 వేలు అందాయి. ఇది నిజమేనని ఆ టీడీపీ నేత ధ్రువీకరించారు. ‘మా ప్రత్యర్థి పక్షం భయంతోనే ఎన్నికల్లో ఇంతింత పంపిణీ చేసింది. కళ్లు మూసుకొని గెలిచే చోట కూడా ఇంత పంపిణీ చేశారంటే అర్థం చేసుకోండి. మాగ్రామం వరకూ ఏదో తిప్పలుపడ్డాం’ అని ఆయన పేర్కొన్నారు.