పోలవరం ప్రాజెక్టు విషయంలో పర్యావరణ అనుమతుల అంశంపై జోక్యం చేసుకోలేమని ఎన్జీటీ ధర్మాసనం స్పష్టం చేసింది. పోలవరం వల్ల మత్స్యకారుల జీవనోపాధికి గండి పడుతుందంటూ ఎన్జీటీలో దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. 2005లో పర్యావరణ అనుమతులు ఇస్తే.. ఈ పిటిషన్‌లో వాటినే సవాలు చేశారని, ఇప్పుడు దీనిపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతిలిచ్చిన 90 రోజుల్లోనే ఏమైనా అభ్యంతరాలు ఉంటే పిటిషన్ వేయాలని ఎన్జీటీ తెలిపింది. మత్స్యకారుల జీవనోపాధి అంశమైనా.. పర్యావరణ అనుమతులపైనే సవాల్ చేస్తూ పిటిషన్ వేశారని, అయినా ఇంత ఆలస్యంగా పిటిషన్ ఎందుకు వేశారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఎన్జీటీ ప్రశ్నించింది. కాగా, తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే పోలవరం వల్ల మత్స్యకారులకు నష్టం జరిగేటట్లయితే ఫోరమ్‌లను ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కు ఎన్జీటీ సూచించింది.
ఇది ఇలా ఉంటే, గత రెండు రోజులుగా పోలవరం పై విషం చిమ్ముతున్న జగన్ సన్నిహితులు కేవీపీ, ఉండవల్లికి మంత్రి దేవినేని ఉమా ఈ రోజు కూడా కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు లోటస్‌పాండ్ కేంద్రంగా కేసీఆర్, జగన్ కుట్రలు పన్నుతున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వేల మంది కార్మికుల ప్రాణాలను ఫణంగా పెట్టి పోలవరం పనులు చేస్తుంటే.. రాజమండ్రి కొట్టుకుపోతుందని కొందరు అసత్యాలు చెబుతూ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పదే పదే ఉత్తరాలు రాసే కేవీపీ, ఉండవల్లి, జగన్‌కి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆరోపించారు.
జగన్‌పై ప్రేమ ఉంటే వైకాపాలో చేరాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసీఆర్ సుప్రీంకోర్టుని, ఆయన కుమార్తె కవిత జాతీయ హరిత ట్రైబ్యునల్‌ని ఆశ్రయించినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. పట్టిసీమ దండగ అని మాట్లాడిన నేతలు.. ఆ నీటి ద్వారా కృష్ణా జిల్లాకు, రాయలసీమ జిల్లాలకు ఎంత లబ్ధి చేకూరిందో ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరానికి రావాల్సిన నిధులను కేంద్రంలో వచ్చే కొత్త ప్రభుత్వం, కొత్త ప్రధాని నుంచి సాధించుకుంటామన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును సందర్శించేందుకు ప్రధాని మోదీ, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌కు తీరికలేకుండా పోయిందని విమర్శించారు. ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై విషం చిమ్మడం ఇప్పటికైనా ఆపాలని మంత్రి సూచించారు.