ఎల్లుండి జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని రాష్ట్ర తాజా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని వైఎస్ జగన్ స్వయంగా ఆహ్వానించారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసిన జగన్, మీరు వస్తే తనకు ఆనందమని చెప్పారు. ఓ సీనియర్ నేతగా, రాష్ట్రానికి ఎన్నో సంవత్సరాలు సీఎంగా పని చేసిన అనుభవమున్న తమ ఆశీస్సులు కావాలని జగన్ కోరినట్టు తెలుస్తోంది. తన తండ్రి దివంగత వైఎస్ కు మీరు సమకాలీకులని గుర్తు చేసిన జగన్, ప్రమాణ స్వీకారానికి వస్తే తాను ఆనందిస్తానని చెప్పినట్టు సమాచారం. దీనిపై చంద్రబాబు సైతం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఇక చంద్రబాబు వస్తారా? లేదా? అన్న విషయమై టీడీపీ అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.
తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఇప్పటికే పలువురు నేతలకు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానం పలుకుతున్న జగన్.. ఇవాళ చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఈనెల 30న జరిగే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధికి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని జగన్ ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈనెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈకార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కాగా, డీజీపీ ఆర్పీ ఠాకుర్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావులు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను సోమవారం స్వయంగా పరిశీలించారు. పలు అంశాలపై డీజీపీ కొన్ని సూచనలు చేశారు.