తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు దంపతులతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, గల్లా జయదేవ్, కోడెల శివప్రసాదరావు, యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొని ఎన్టీఆర్కు నివాళులర్పించారు. పార్టీ కార్యాలంలో తెదేపా జెండా ఎగురవేసిన చంద్రబాబు నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇకపై ప్రతిరోజు గుంటూరు కార్యాలయానికి వస్తానని చెప్పారు. రోజూ 3గంటల పాటు నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు.
ఏపీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ అంతటి నాయకుడికి కూడా ఓటమి తప్పలేదన్నారు. కానీ ఎన్టీఆర్ ఏనాడు అధైర్యపడలేదన్నారు. మనం కూడా అదే ఎన్టీఆర్ స్పూర్తితో ముందుకు సాగాలని నేతలు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. సంక్షేమ పధకాల సృష్టికర్త ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా బాబు చెప్పుకొచ్చారు. ప్రతి తెలుగువాడు ఎన్టీఆర్కు ఘనంగా నివాళులు అర్పించాలన్నారు. మనకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా సంక్షేమం-అభివృద్ధిని మాత్రం నిర్లక్ష్యం చేయలేదన్నారు. నాలుగు రోజులుగా ఎంతో మంది తన దగ్గరికొచ్చి బాధపడ్డారన్నారు. మూడున్నర దశాబ్దాలుగా మీకు అండగా ఉన్నా.. ఇప్పడు కూడా మీతోనే ఉంటానని నేతలు, కార్యకర్తలకు, అభిమానులు బాబు అభయమిచ్చారు.
"నా కుటుంబం కంటే నాకు పార్టీనే ముఖ్యం. మళ్లీ మునుపటిలాగే పోరాటం చేద్దాం. ఎన్నికల ఫలితాలపై సమీక్షలు చేసుకుందాం. కార్యకర్తలు చెప్పే వాటిని విని ముందుకు సాగుదాం. ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి బాధ్యతగల ప్రతి పక్షంగా పని చేద్దాం. ఎవరి స్దాయిలో వారు సమీక్ష చేసుకోని పార్టీ పటిష్టతకు కృషి చేయాలి. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోని టీడీపీకి పూర్వ వైభవం కోసం కృషి చేద్దాం. ఎవ్వరూ అదైరపడవద్దు. కార్యకర్తలను నేను కాపాడుకుంటాను. మీకు అన్ని విధాలా అండగా ఉంటాను. మార్పు తేవాలనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. ఎదురుదెబ్బలు తిన్నా ఎన్టీఆర్ మనోధైర్యం కోల్పోలేదు. అదే స్ఫూర్తితో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం" అని చంద్రబాబు కార్యకర్తలు, నేతల్లో నూతనోత్సాహం నింపారు.