ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యి, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు కానున్న తరుణంలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ వైపు అందరి దృష్టి మళ్లింది. సుమారు తొమ్మిదన్నరేళ్లుగా రాజ్‌పాల్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్ తన పదవీ కాలంలో ఇప్పటి వరకు నలుగురు సిఎంలతో ప్రమాణం చేయించారు. రాష్ట్ర విభజన, రాష్ట్రపతి పాలన, ఏకకాలంలో సుదీర్ఘ కాలం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా పని చేయడం వంటి పలు కీలక పరిణామాలు, మూలమలుపులు, సంక్షోభ సమయాల్లో నరసింహన్ పాత్ర కనిపిస్తుంది. ఇలాంటి అరుదైన అవకాశం ఆయనకే వచ్చింది. ఇదొక రికార్డన్న చర్చ అటు ప్రభుత్వ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
సమైక్య రాష్ట్రంలో కె రోశయ్య తర్వాత 2010 డిసెంబర్ 25న కిరణ్‌కుమార్‌రెడ్డితో, రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 2న తెలంగాణ సిఎంగా కెసిఆర్, అదే సంవత్సరం జూన్ 8న ఎపి సిఎంగా చంద్రబాబుతో, తిరిగి నిరుడు డిసెంబర్‌లో రెండో సారి కెసిఆర్‌తో ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేయించిన నరసింహన్ ఈ నెల 30న మరో కొత్త సియంతో ప్రమాణం చేయించనున్నారు. 1968 ఐపిఎస్ బ్యాచ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికైన నరసింహన్ అనంతరం చాలా ఏళ్లపాటు కేంద్ర నిఘా సంస్థ (ఐబి)లో పని చేశారు. ఐబి చీఫ్‌గా 2006 డిసెంబర్ వరకు పని చేసిన ఆయన ఆ ఏడాది చివరిలో రిటైరయ్యారు. కాగా అప్పటి యుపిఎ-1 సర్కారు నరసింహన్‌ను మావోయిస్టు ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా 2007 జనవరిలో నియమించింది.
ఎపి గవర్నర్‌గా ఎన్‌డి తివారీ రాజీనామా చేశాక, ఆ సమయంలో కెసిఆర్ నిరాహారదీక్ష, అనంతరం విభజన ఆందోళనలు ఉధృతంగా నడుస్తున్న వేళ నరసింహన్‌ను ఎపికి ఇన్‌ఛార్జి గవర్నర్‌గా యుపిఎ-2 సర్కారు 2009 డిసెంబర్ 27న నియమించింది. 2010 జనవరి 23న ఎపికి పూర్తి స్థాయి గవర్నర్‌గా వేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఇఎస్‌ఎల్ అప్పటి కాంగ్రెస్ కేంద్ర పెద్దలతో మంత్రాంగం నడుపుతున్నారంటూ అప్పట్లో కెసిఆర్, టిడిపి ఆరోపణలు చేశాయి. పార్లమెంట్‌లో బిల్లు నేపథ్యంలో విభజనను నిరసిస్తూ అప్పటి ఉమ్మడి రాష్ట్ర సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 2014 ఫిబ్రవరి 19న రాజీనామా చేసిన దరిమిలా మార్చి 1 నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకొచ్చింది. అప్పటి నుంచి ఎన్నికలు ముగిసి ఎపి, తెలంగాణాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరే వరకు సుమారు మూడు నెలలకుపైగా రాష్ట్రపతికి ప్రతినిధిగా పాలన సాగించారు.