ఏపీలో మరో మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ నెల 30న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పోలీస్ శాఖలో మార్పులు-చేర్పులు మొదలయ్యాయి. ఏపీ డీజీపీగా ఠాకూర్ స్థానంలో సీనియర్ ఐపీఎస్ గౌతమ్ సవాంగ్‌ను నియమిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక రాష్ట్రంలో భద్రతలో కీలకమైన ఇంటిలిజెన్స్ చీఫ్ బాధ్యతలు ఎవరికి దక్కబోతున్నాయన్న చర్చ మొదలయ్యింది. ఏపీ కేడర్‌కు చెందిన పలువురు ఐపీఎస్‌ల పేర్లు తెరపైకి వస్తున్నా.. తెలంగాణలో హైదరాబాద్ రేంజ్ ఐజీగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్ర పేరు కొత్తగా తెరపైకి వచ్చింది.
స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ నుంచి రిలీవ్ చేసి.. డిప్యుటేషన్ పై ఏపీకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఆయనకు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. జగన్ విజ్ఞప్తి మేరకు స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రచారంపై తెలుగు రాష్ట్రాల పోలీస్‌శాఖ నుంచి అధికారిక సమాచారం మాత్రం లేదు. స్టీఫెన్ రవీంద్ర గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేశారు. అయితే తెలంగాణాలో ఉన్న కీలక అధికారిని, ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన ఇంటలిజెన్స్ పదవి ఇవ్వటం పై, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ప్రస్తుత డీజీపీ ఆర్.పి.ఠాకూర్‌ను తప్పించి ఆయన స్థానంలో గౌతమ్ సవాంగ్‌ను నియమించనున్నారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసుశాఖపరంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ పురపాలక మైదానాన్ని శనివారం సాయంత్రం ఆయన సందర్శించి అధికారులతో సమీక్షించారు. గతేడాది జులై 1న ఆర్.పి.ఠాకూర్ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 11 నెలలుగా పదవిలో కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో సవాంగ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.