ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా జగన్ చంద్రబాబుకు ఫోన్ చేశారు. అయితే.. టీడీఎల్పీ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఈ అంశంపై చర్చించిన చంద్రబాబు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. పార్టీ తరపున ప్రతినిధులను పంపాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఉదయం జగన్ నివాసానికి ఇద్దరు టీడీపీ నేతలు వెళ్లనున్నారు. జగన్కు ఈ బృందం శుభాకాంక్ష లేఖని ఇవ్వనుంది. చంద్రబాబును ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ను ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించడం, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి జగన్ ఆహ్వానించడంపై టీడీపీ నేతలు పెదవి విరిచారు. చంద్రబాబు వెళ్లకపోవడమే మేలనే అభిప్రాయాన్ని టీడీఎల్పీ భేటీలో పాల్గొన్న మెజార్టీ నేతలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. 2014లో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో కూడా ఆహ్వానించినప్పటికీ అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ హాజరుకాలేదు. ఇదిలా ఉంటే.. జగన్ ప్రమాణస్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ హాజరవుతున్నారు.