ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే జగన్ తన పాలనపై పట్టు పెంచుకునేందుకు సీఎంవో అధికారులపై బదిలీ వేటు వేశారు. చంద్రబాబు టీమ్‌ను టార్గెట్ చేస్తూ.. సీఎంవో కార్యాలయంలో చాలా కాలంగా పని చేస్తున్న ఉన్నతాధికారులందరిపై బదిలీ వేటు వేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం జారీ చేశారు. ఇందులో ప్రధానంగా సీఎం కార్యాలయంలో ఉన్నటువంటి ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న సతీష్ చంద్రతోపాటు ముఖ్యకార్యదర్శి సాయి ప్రసాద్, కార్యదర్శి గిరిజా శంకర్‌తోపాటు అడుసుమిల్లి రాజమౌళిపై బదిలీ వేటు వేశారు. వారిని సాధారణ పరిపాలనకు రిపోర్టు చేయాల్సిందిగా సీఎస్ ఆదేసించారు.
మరో పక్క, అదనపు కార్యదర్శిగా కే.ధనుంజయ రెడ్డిని నియామించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జీవో జారీ చేశారు. జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి నియామకం ధనుంజయరెడ్డిదే కావడం విశేషం. సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి కార్యదర్శి హోదాలో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో సేవలు అందించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్లో ఎండీగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వ్యవసాయశాఖలోనూ పనిచేశారు. శ్రీకాకుళం కలెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచీ ధనుంజయరెడ్డి తన సేవలను జగన్ క్యాంపు కార్యాలయంలోనే అందిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన పనుల్లో నిధుల వ్యయం, బిల్లుల మంజూరుపై స్పష్టతనిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మెమో జరీ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు దిగజారుతున్నాయని, చెల్లింపులకు ఆర్థిక వనరులు లేనందున రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నీ సదరు ఇంజినీరింగ్ పనులను నిలిపేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఏప్రిల్ 1 కంటే ముందు మంజూరై, ఇంకా ప్రారంభించని పనుల్ని రద్దుచేయాల్సిందేనని అన్ని శాఖలకు ఈ సందర్భంగా సూచనలు చేశారు. కనీసంలో కనీసం 25 శాతం కూడా పనులు పూర్తి కాని ప్రాజెక్టుల విషయంలో వాటి విలువలను తాజాగా నిర్ధరించి, తదుపరి చెల్లింపులు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆయా విభాగాధిపతులు, అధికారులు తాజా నిబంధనల ప్రకారం ధృవీకరించిన పనులకు మాత్రమే చెల్లింపులు చేయాలని, పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి సీఎస్ స్పష్టం చేశారు.