తెదేపా అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం విజయవాడ ఎంజీ రోడ్డులోని పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తనకు కేంద్ర విదేశాంగ శాఖ జారీ చేసిన ‘డిప్లొమాటిక్ పాస్‌పోర్టు’ని అక్కడ అప్పగించారు. తనకు సంబంధించిన సాధారణ పాస్‌పోర్టును తీసుకున్నారు. ఆయన తన వ్యక్తిగత సహాయకులు, భద్రతా సిబ్బందితో కలసి వచ్చారు. దాదాపు 20 నిమిషాలపాటు అక్కడ ఉన్నారు. ఆయన వచ్చిన పని 8-10 నిమిషాల్లోనే పూర్తయింది. మిగతా సమయంలో ఆయనతో అక్కడికి పాస్‌పోర్టు పనుల నిమిత్తం వచ్చిన వారు, కొందరు సిబ్బంది ఫొటోలు దిగారు.
ఇది ఇలా ఉంటే, కృష్ణా, గుంటూరు, విశాఖజిల్లాల నుంచి రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. వారంతా చంద్రబాబును చూడగానే కన్నీటి పర్యంతమయ్యారు. వాళ్ల ఆవేదన వారి మాటల్లోనే.. ‘నీ వెంటే మేమన్నా.. నీ కోసమే వందల కిలోమీటర్ల నుంచి వచ్చామన్నా.. ఇంత కష్టపడినా ఓడిపోయామనేదే మా అందరి బాధన్నా.. మాలాంటి లేనివాళ్లు ఎందరికో ఇళ్లు ఇచ్చావన్నా.. నెలవారీ పింఛన్లు ఇచ్చావయ్యా.. నువ్వు చేయని ఏమీ లేదయ్యా..? అయినా ఓడిపోయామంటే నమ్మలేకపోతున్నాం..పేదలకు ఇన్ని చేసిన నువ్వు ఓడిపోవడం ఏమిటయ్యా..? ఎక్కడో.. ఏదో జరిగిందయ్యా.. ఇదంతా ఏదో మాయగా ఉందయ్యా.. ఇది మేమిచ్చిన తీర్పు కాదయ్యా.. మిషన్లు ఇచ్చిన తీర్పు అయ్యా.. ఎప్పుడూ పని పని అని పరితపించావయ్యా.. పనిచేసే వాడిని ఓడించడం ఎక్కడైనా ఉందా? ఏదో మాయ జరిగిందయ్యా..’ అంటూ వాపోయారు. వాళ్లనుచూసి చంద్రబాబు చలించిపోయారు. ‘మళ్లీ మంచి రోజులు వస్తాయి. అందరూ ధైర్యంగా ఉండండి. నిబ్బరంగా ఉండండి’ అని ధైర్యం చెప్పి వారందరినీ ఊరడించారు.