తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సభలో అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..‘‘ ప్రజల కోపం వల్ల మనం ఓటమి చెందలేదు. జగన్ పట్ల ఉన్న సానుభూతే ఆ పార్టీని గెలిపించింది. రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు చిత్తశుద్ధితో పని చేశాం. కాలంతో పరిగెత్తాం, అనేక పనులు చేశాం. సమర్ధ నీటినిర్వహణతో నీటి కొరతను అధిగమించాం. రాజధాని నిర్మాణ పనులు వేగంగా చేపట్టాం. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా చాలా చేశాం. కానీ, ప్రజల అంచనాలు వేరుగా ఉన్నాయి. అయినా 39.2శాతం ఓట్లు రాబట్టాం."
ఏదేమైనా కొంతకాలం వేచి చూద్దాం. కొత్త ప్రభుత్వం ఏంచేస్తుందో చూద్దాం. అన్నింటినీ నిశితంగా గమనిద్దాం, ఆతర్వాతే స్పందిద్దాం. ఎన్నికైన టిడిపి శాసన సభ్యుల్లో ముగ్గురు(మద్దాలి గిరి, ఆదిరెడ్డి భవాని, రామరాజు) మినహా అందరూ గతంలో పనిచేసినవారే. పాత,కొత్త కలబోతతో తెలుగుదేశం వాణి బలంగా వినిపించాలి. ఆయా నియోజకవర్గాల సమస్యలను సభలో ప్రస్తావించాలి. సకాలంలో పరిష్కారం అయ్యేలా శ్రద్ధ వహించాలి. వివిధ రంగాలపై పట్టు సాధించాలి, అధ్యయనం చేయాలి,ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి. ప్రధాన వక్తలుగా పేరు తెచ్చుకునే అవకాశం ఇదే. నాయకత్వ సామర్ధ్యం పెంచుకోవాలి. ప్రభుత్వం కన్నా ప్రతిపక్షం వాణికే ప్రజల్లో ప్రాధాన్యం. "
"ప్రజా సమస్యల పరిష్కారానికి శాసన సభ గొప్ప వేదిక. సభకు హాజరు కాకుండా గత ప్రతిపక్షం వ్యవహరించినట్లు చేయరాదు. ప్రతి ప్రాంతంలో ప్రజలతో నాయకులంతా మమేకం కావాలి. ఎక్కడా పార్టీపైన, ప్రభుత్వంపైన ప్రజల్లో వ్యతిరేకత లేదు. గత 6రోజులుగా నన్ను కలిసివారందరిలో ఆవేదన,ఆందోళన ఉంది. ఇదెలా జరిగింది అనే ఆవేదన అందరిలో ఉంది. ఆయా ప్రాంతాలలో స్థానిక పరిస్థితులపైనే ప్రజల్లో భిన్నాభిప్రాయం ఉంది. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుందాం. అన్నివర్గాల ప్రజల మద్దతు సాధించడమే లక్ష్యంగా పనిచేద్దాం.’’ అని చంద్రబాబు సూచించారు. టీడీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ... ఉప నేతలు, విప్ పదవులు ఎవరికివ్వాలనే నిర్ణయాన్ని చంద్రబాబుకే అప్పగించామన్నారు. తక్కువ మంది సభ్యులున్నా..తాము ప్రజల తరఫున పోరాడతామన్నారు. ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామని చినరాజప్ప తెలిపారు.