తుదిదశ పోలింగ్‌కు కొన్ని గంటల ముందు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని తాజాగా ఆదేశించింది. రామచంద్రాపురం మండలంలోని కుప్పం బాదూరు, కాలూరులో ఆదివారం రీపోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్.ఆర్.కమ్మపల్లి, పులవర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఇటీవలే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈసీ తాజా నిర్ణయంతో రేపు చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఏడు కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలివిడతలో ఏప్రిల్ 11న పోలింగ్ జరిగితే ...34 రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశాలివ్వడమేంటని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనచేస్తున్నారు. ఈక్రమంలో మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు రావడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉంటే, అసలు రేపు పోలింగ్ అంటూ, కనీసం 24 గంటల టైం కూడా ఇవ్వకుండా, ఇప్పటికిప్పుడు ఆదేశాలు ఇస్తే, ప్రజలకు ఎలా తెలుస్తుంది, అధికారులు ఎలా ఏర్పాట్లు చేస్తారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈసీ ధోరణి చూస్తుంటే, కౌంటింగ్ అయిన తరువాత కూడా, రీ పోలింగ్ పెట్టినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది.