గతంలో ఎంపీగా పనిచేసిన ఆ అభ్యర్థి మళ్లీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికలకు ముందు తన బంధువులతో సహా వెళ్లి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. తాను పోటీచేయబోయే పార్లమెంట్ స్థానం పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు అయ్యే ఖర్చంతా కూడా తానే పెట్టుకుంటానని గట్టిగా నమ్మబలికారు. తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి.. నామినేషన్లు పూర్తయ్యాక అయ్యగారు అసలు విషయం చల్లగా చెప్పారు. తనవద్ద పెద్దగా డబ్బులు లేవనీ, తననుంచి ఏమీ ఆశించవద్దనీ అసెంబ్లీ అభ్యర్థులకు స్పష్టంచేశారు. దీంతో ఆ ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు ఎవరి తిప్పలు వారు పడ్డారు. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
తనకు పరిచయం ఎక్కువగా ఉన్న రెండు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ఒకరోజు ఉదయం ఆయన తన వద్దకు పిలిపించుకున్నారట. బ్రేక్‌ఫాస్ట్ పెట్టి వారిని బాగా దువ్వారట. "మీరు పోటీచేసే రెండు అసెంబ్లీ స్థానాల్లో నాకు విస్తృతంగా అనుచరగణం ఉంది. పైగా ఒక అసెంబ్లీ స్థానం నా సొంత నియోజకవర్గం'' అని వారికి చెప్పుకొచ్చారట. "ఆ రెండు స్థానాల్లో మీరు పంచాలనుకుంటున్న డబ్బులు నాకే ఇవ్వండి. నా డబ్బులతోపాటు మీ డబ్బులు కూడా కలిపి ఓటర్లకు పంపిణీ చేస్తాను'' అని వారిని నమ్మించారట. పాపం! రాజకీయాలకు కొత్తయిన ఆ అమాయక అభ్యర్థులు ఇరువురూ ఎంపీ అభ్యర్థి మాటలకు బుట్టలో పడ్డారట. ఓటర్లకు తాము పంచాలనుకున్న డబ్బును పెద్ద మొత్తంలోనే ఆయనకు సమర్పించుకున్నారట.
పోలింగ్‌కు అయిదు రోజుల సమయం ఉన్న తరుణంలో ఓటర్లకు డబ్బు పంపిణీ జరగలేదని అసెంబ్లీ అభ్యర్థులకు తెలిసింది. వెంటనే వారు సదరు ఎంపీ అభ్యర్థి దగ్గరకు వెళ్లి సంగతేమిటని నిలదీశారు. దీంతో ఆయన డబ్బు పంపిణీ చేసినంటూ బుకాయించారట. పోలింగ్‌కు రెండ్రోజుల ముందు పార్టీ శ్రేణులు తమకు డబ్బులు అందలేదనీ, ఓటర్లకు పంచలేదనీ ఆ ఇద్దరు అసెంబ్లీ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చారట. దీనిపై పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వెంటనే వైసీపీ కేంద్ర కార్యాలయం ఈ విషయంపై ఆరాతీసింది. అప్పుడు తెలిసిందట అయ్యగారి అసలు నిర్వాకం. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తాను డబ్బులు పంపిణీ చేశానంటూ మరోసారి బుకాయించారట. ఆయనదంతా బుకాయింపేనని పార్టీ పెద్దలు గ్రహించారట. అప్పటికే సమయం మించిపోవడంతో కొంత మొత్తాన్ని ఆ అభ్యర్థులు ఇద్దరికీ సర్దుబాటు చేశారట. ఈ డబ్బు కూడా పూర్తిస్థాయిలో ఓటర్లకు చేరకపోవడంతో అసెంబ్లీ అభ్యర్థులు డీలాపడ్డారు. ఆ ఎంపీ అభ్యర్థి తమకు సహాయం చేయకపోగా, నిండా ముంచేశారని ఇప్పుడు వారు బోరుమంటున్నారు. వైసీపీ అధినేత జగన్‌కు కూడా సదరు ఎంపీ అభ్యర్థిపై ఫిర్యాదు చేశారు.