సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. త్వరలో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అందరి దృష్టి ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అని మాత్రమే. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఎదురు చూసేది కేవలం ఎన్నికల ఫలితాల కోసం మాత్రమే కాదు... పవర్ స్టార్ నుంచి తీయని కబురు వస్తుందని వారు వేయి కళ్లతో వేచిఉన్నారు. ఎన్నికల తర్వాత పవర్ స్టార్ మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన గతంలోనే కొందరు నిర్మాతలకు సినిమాలు చేస్తానని కమిట్మెంట్స్ ఇచ్చారని, ఎన్నికల ఫలితాల తర్వాత వాటిని ఫుల్‌ఫిల్ చేస్తారంటూ ఫిల్మ్ నగర్లో చర్చ సాగుతోంది. ‘గోపాల గోపాల' ఫేం డైరెక్టర్ డాలీతో మరో సినిమా చేయడానికి అప్పట్లో ప్రయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే.
నిర్మాత రామ్ తాళ్లూరి ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదు అనేది పవన్ సన్నిహితుల వాదన. గతంలో సినిమా ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవమే... కానీ పవన్ రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత ఆ ప్రయత్నం విరమించుకున్నారని స్పష్టం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగ బాబు సైతం ఇటీవల ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడంపై క్లారిటీ ఇచ్చారు. కళ్యాణ్ బాబుకు మళ్లీ సినిమాల వైపు వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తన తమ్ముడిని రాజకీయాల్లో అన్ పాపులర్ చేయడానికే ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తున్నారని ఆయన తెలిపారు.
స్వయంగా పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి... జనసేన పార్టీ శ్రేణులు కానీ, నాగబాబు చెప్పిన విషయాలు కానీ అభిమానుల చెవికెక్కడం లేదు. పవర్ స్టార్ మళ్లీ సినిమాల్లోకి తిరిగి వస్తారనే ఆశ అలాగే ఉండి పోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాలు చేస్తారనే నమ్మకంతో చాలా మందిలో బలంగా నాటుకుపోయింది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తన సినిమా రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఆదివారం గుంటూరు జరిగిన జనసేన రివ్యూ మీటింగులో మాట్లాడుతూ... రాబోయే 25 ఏళ్లలో రాజకీయాల్లో సమూల మార్పులు తేవడమే జనసేన లక్ష్యమని తెలిపారు. తాను రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకోబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను అభిమానులు, జనసేన సానుభూతి పరులు నమ్మవద్దని స్పష్టం చేశారు.