ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికలకు ముందు అనిల్‌చంద్ర పునేఠా స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యంను ఏపీ సీఎస్‌గా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పునేఠాను ఎన్నికల విధులతో సంబంధం లేని శాఖలో నియమించాలని ఈసీఐ సూచించింది. అప్పట్నుంచి ఆయన వెయిటింగ్‌లోనే ఉన్నారు. ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పునేఠాకు పోస్టింగ్ ఇస్తూ తాజాగా ఈసీ నిర్ణయం తీసుకోవడంతో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాలు జారీ చేశారు. అయితే చీఫ్ సెక్రటరీ లాంటి ఉన్నత పదవి చేసిన పునేఠాకు, ఒక కార్పొరేషన్ స్థాయి పోస్టింగ్ ఇవ్వటం చూసి, ఈసీ తీరుని తప్పుబడుతున్నారు.
మార్చి నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన అనంతరం వరుసగా చోటుచేసుకున్న పరిణామాలతో, రాష్ట్రంలో అధికారులు టార్గెట్ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం కోడ్‌ను ఉల్లంఘించారని ఇద్దరు ఎస్పీలతోపాటు, ప్రభుత్వ నిఘావర్గాల అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్‌చంద్ర పునేఠలపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే కొత్త సీఎస్‌గా రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కొత్త సీఎస్‌గా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన ఏప్రిల్ 6వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు.
సీఎస్ బాధ్యతల నుండి తొలగించిన అనిల్‌చంద్ర పునేఠను ఎన్నికలకు సంబంధం లేని విధులు అప్పగించాలని కేంద్ర ఎన్నికల సంఘం తన ఆదేశాలలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఇంతవరకూ ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో రాష్ట్ర ఐఏఎస్ అధికారుల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో తన సర్వీసును, తన హోదాను కూడా లెక్కచేయకుండా ఐఏఎస్ అధికారిగా తన మూడుదశాబ్ధాల అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆయన్ను పక్కన పెట్టిన తీవ్ర దుమారాన్ని లేపాయి. ఈనెల 31 పదవీ విరమణ చేసే సమయంలో ఇటువంటి అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొనడం చాలా ఇబ్బందిగా మారటంతో, ఆయనకు ఇప్పుడు ప్రాముఖ్యత లేని కార్పొరేషన్ చైర్మెన్ పదవి ఈసీ కట్టబెట్టింది.