టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనే ఒక మోడీ ఫిడేల్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు దగ్గరపడుతుండటంతో రాష్ట్రాల బాటపట్టిన కేసీఆర్ పార్టీల అధినేతలు, సీఎంలతో భేటీకి ఆపసోపాలు పడుతున్నారు. అయితే ఇప్పటికే ఒక దఫా దాదాపు తనకు అనుకూలంగా రాష్ట్రాలన్నీ తిరిగొచ్చిన కేసీఆర్ రెండోసారి మళ్లీ ఫెడరల్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవలే కేరళ వెళ్లిన కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయ్యి కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ మెజార్టీ సీట్లు దక్కించుకుని గెలిచే అవకాశాల్లేవని ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని నిశితంగా వివరించారు. అయితే తమిళనాడు వెళ్లి స్టాలిన్ ను దువ్వే ప్రయత్నం చేసారు.
ముందుగా కేసీఆర్, మోడీకి అనుకూలం అని తెలుసుకున్న స్టాలిన్ కేసీఆర్ కు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో కేసీఆర్, తమిళనాడులోని గుడిలు, గోపురాలు తిరిగి హైదరాబాద్ వచ్చి, మళ్ళీ స్టాలిన్ తో భేటీకి ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో స్టాలిన్ సోమవారం రమ్మని కేసీఆర్ కు కబురు పంపారు. దీనిలో భగంగా కేసీఆర్ ఈ రోజు డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, జాతీయ రాజకీయాలపై కూలంకశంగా చర్చించారు. గంటన్నరపాటు జరిగిన ఈ భేటీలో కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమికి మద్దతివ్వాల్సిందిగా స్టాలిన్‌ను కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను స్టాలిన్ సున్నితంగా తిరస్కరించినట్లు డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.
తాము కాంగ్రెస్ వైపే అని కేసీఆర్‌కు స్టాలిన్ తేల్చిచెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాము కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్తామని, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు సహకరిస్తామని స్టాలిన్ స్పష్టం చేశారట. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ స్ఫూర్తికి మద్దతిస్తామని, అయితే కాంగ్రెస్ విషయంలో తమ వైఖరి మారబోదని తేల్చిచెప్పినట్లు డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైతే కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని కేసీఆర్‌ను స్టాలిన్ కోరినట్లు సమాచారం. ఈ పరిణామంతో షాక్ అయిన కేసీఆర్, మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే... స్టాలిన్‌తో భేటీ అనంతరం కేసీఆర్ కర్నాటకలో పర్యటించనున్నారని తెలుస్తోంది. పర్యటనలో భాగంగా కర్నాటక సీఎం కుమారస్వామితో భేటీ అయ్యి ఫెడరల్ ఫ్రంట్ విషయమై చర్చించనున్నారు. అయితే కాంగ్రెస్-జేడీఎస్ కలిసి కుమారన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా కేసీఆర్ కు ఎదురు దెబ్బ తప్పేలా లేదు.