ఎన్నికల నాటి నుండి సీఎం వర్సెస్ సీఎస్‌గా ఉన్న వ్యవహారం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. పలితాల సమయం దగ్గర పడుతున్న వేళ..ఈ ఇద్దరు భేటీ అయ్యారు. సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. ఇద్దరూ అరగంటకు పైగా భేటీ అయ్యారు. ఈ సమయంలో సీఎస్ తీరు పైన సీఎం క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో..సీఎస్ సైతం తాను సీఎంను ధిక్కరిస్తున్నట్లుగా సాగుతున్న ప్రచారం పైన వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇక, కేబినెట్ సమావేశంలో కొనసాగుతున్న అనిశ్చితి పైనా ఇద్దరూ చర్చించారు.
ఎన్నికల వేళ..సీఎస్‌గా ఉన్న పునీఠాను తప్పించి ఎన్నికల సంఘం ఎల్వీ సుబ్రమణ్యంను ఏపీ సీఎస్‌గా నియమించింది. ఆ నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. ఇక, కొత్త సీఎస్‌గా నియమితులైన ఎల్వీ సుబ్రమణ్యం గురించి ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన కోవర్టు అని..జగన్ కేసుల్లో సహ ముద్దాయి అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఈ వ్యాఖ్యల మీద ఐఏయస్‌ల సంఘం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక, ఇదే సమయంలో సీఎం కు అధికారాలు లేవంటూ ఎల్వీ ఒక పత్రిక ఇంటర్యూలో చేసిన కామంట్లు చంద్రబాబుకు మరింత ఆగ్రహం తెప్పించాయి. దీని పైన ఆయన నేరుగా లేఖ ద్వారా వివరణ కోరారు. సీఎస్ సైతం తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ సింపుల్‌గా ఇచ్చిన సమాధానం సీఎంకు మరింత ఆగ్రహం తెప్పించాయి.
సీఎం సమీక్షల నిర్వహణ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఎవరూ హాజరు కావద్దంటూ సీఎస్ అధికారులకు సూచించటం మరింత గ్యాప్ పెరిగింది. ఇక, ఈ రోజు సడన్‌గా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సారి తన వద్దకు వచ్చిన సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంకు ముఖ్యమంత్రి గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సీఎస్ వ్యవహరించిన తీరు పైన వివరణ కోరినట్లు తెలుస్తోంది. ప్రజా ప్రభుత్వం ఇంకా ఉండగానే..జవాబు దారీ తనం లేకుండా పని చేస్తే ఎలాగని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. సీఎస్ కేబినెట్‌కు లోబడి పని చేయాల్సి ఉంటుందనే విషయం గుర్తు చేసారు. ఇక, ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు కేబినెట్ సమావేశం నిర్వహణకు అనుమతి కోరుతూ..అజెండాతో సహా ఏపీ ప్రభుత్వం నుండి సీఎస్ లేఖ రాసారు. దీనిని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. అయితే, ఈ నెల 14న కేబినెట్ సమావేశానికి ముహూర్తం నిర్ణయించినా..ఇప్పటి దాకా ఎన్నికల సంఘం నుండి అధికారికంగా అనుమతి రాలేదు. సమయం తక్కువగా ఉండటంతో...అజెండాగా ఖరారు చేసిన అంశాల పైన ఏరకంగా ముందుకు వెళ్లాలనే అంశాన్ని చర్చించారు.