శ్రీవారి పాదాల చెంత అలిపిరిలో టాటా ట్రస్టు ఆధ్వర్యంలో రూ.140 కోట్లతో శ్రీవేంకటేశ్వర క్యాన్సర్ వైద్య, విజ్ఞాన సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్న ఆయన ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రిని తిరుపతిలో నిర్మించడం అదృష్టంగా వర్ణించారు. ఆస్పత్రిని మొదటి దశలో 350 పడకలు, రెండో దశలో వేయి పడకలతో నిర్మించనున్నట్లు వివరించారు. ఆస్పత్రి కోసం తితిదే 25 ఎకరాల స్థలం కేటాయించిందని, శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టాటా ట్రస్టు ఛైర్మన్ రతన్ టాటా చేతులు మీదుగా జరుగుతుందని చెప్పారు. కేన్సర్ వ్యాధి నివారణకు రతన్ టాటాతో పాటు ముఖ్యమంత్రి కంకణం కట్టుకుని చర్యలు చేపట్టారని వివరించారు.
మన రాష్ట్రంలో ఏటా 50 వేల క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదవుతున్నట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు పూర్తయితే, ముందస్తు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడం ద్వారా వ్యాధి తీవ్రతను చాలావరకు నిరోధించవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం రోగుల్లో 60 శాతం మంది పేదలకు అతితక్కువ ఖర్చుతో క్యాన్సర్ చికిత్సలు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 2019లోనే ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేసి 300 పడకలతో ఆస్పత్రిని ప్రారంభించేలా ట్రస్ట్ ప్రణాళిక రూపొందించుకుది, 20 లీనియర్ యాక్సిలేటర్లతో రేడియేషన్ ఆంకాలజీలు విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు టాటా ట్రస్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. ఫలితంగా రోగులు ఆలస్యం లేకుండా ఎప్పటికప్పుడు రేడియేషన్ చికిత్సలు పొందగలుగుతారు.
రోగులు, అటెండర్లకు వసతి సదుపాయం కోసం ధర్మశాలను కూడా ఆస్పత్రి ఆవరణలో నిర్మించనున్నారు. తద్వారా రోగులు తక్కువ ఖర్చుతో ఇక్కడే ఉండి చికిత్స చేసుకోవచ్చు. మూడు దశల్లో ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేస్తారు. ట్రస్ట్ నిర్వాహకులు మూడేళ్ల క్రితమే దీని పై టీటీడీని సంప్రదించారు. అప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ద్వారా సాంకేతిక సేవలు పొందుతున్న టీటీడీ ఆసుపత్రి పై తమ వంతు సహకారం అందించడానికి ఆమోదించింది. ఈ క్రమంలో గత ఏడాది మే 5న శ్రీవారి సన్నిధిలోని రంగనాయకుల మండపంలో అప్పటి ఈవో సాంబశివరావు, టాటా గ్రూప్ మేనేజింగ్ ట్రస్టీ వెంకటరమణన్ మధ్య ఒప్పందం కుదిరింది. రూ140 కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యే క్యాన్సర్ ఆస్పత్రికి టాటా ట్రస్ట్ రూ.100 కోట్లు కేటాయించగా, టీటీడీ తన దాతల నుంచి మరో రూ.40 కోట్లు సమీకరించేలా ప్రాథమికంగా ఒప్పందంలో పేర్కొన్నట్టు తెలిసింది. ఇందుకోసం అలిపిరి వద్ద ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ సమీపంలో 25 ఎకరాల స్థలాన్ని టీటీడీ లీజు పద్దతిలో టాటా ట్రస్టీకు కేటాయించింది.