ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. చంద్రబాబు తన కుటుంబసభ్యులతో, ప్రజాప్రతినిధులతో కలిసి పోలవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం గ్యాలరీని ప్రారంభించారు. ఈ పర్యటనలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్‌లోని కారు బోల్తా కొట్టింది. వర్షం కారణంగా కారు టైర్లు జారడంతో కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారు కొండవైపుకు పడటంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో పలువురు టీడీపీ నేతలకు స్పల్ప గాయాలయ్యాయి.
మంత్రి పుల్లారావు ఘటనాస్థిలి పరిశీలించారు. సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు ప్రమాదం గురించి పుల్లారావును అడిగితెలుసుకున్నారు. ప్రమాదంపై విచారణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల పోలవరం పర్యటనలో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దెందులూరు సమీపంలో ఓ బస్సు మట్టిలో దిగబడిపోయింది. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వేరే వాహనాల్లో పోలవరానికి బయలుదేరి వెళ్లారు.
పోలవరం గ్యాలరీ వాక్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. బుధవారం ఉదయం 10.05 గంటలకు గ్యాలరీ వాక్కు ముహూర్తం నిర్ణయించారు. 20 నిమిషాలు ముందుగా, 9.45 గంటలకల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పోలవరం ప్రాంతానికి చేరుకోవాలని సీఎంవో మంగళవారం ఆహ్వానాలు పంపింది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు 8 బస్సుల్లో పోలవరం యాత్రకు బయల్దేరారు.