సమాచార సంకేతిక రంగం ఒక విప్లవం అని, దానితో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుంటున్నామని, ఈ స్థాయిలో ఐటీ, ఐవోటీలను ఉపయోగించుకుంటున్న ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదన్నారు. బుధవారం ఇక్కడ ‘ఇ-రైతు డిజిటల్ మార్కెట్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. భూగర్భ జలాల నుంచి పిడుగులు పడే సమాచారం వరకు రియల్‌టైమ్‌లో సమాచారాన్ని అందించే వ్యవస్థలని ఏర్పరచుకున్నామని చెప్పారు. కలుషితాహారం నుంచి బయటపడేందుకు.. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
సహజసిద్ధ సేద్యపు విధానాలు కచ్చితంగా అనుసరించాల్సిన పరిస్థితులు ఇప్పుడున్నాయన్నారు. మనం తినే తిండిలో సగానికిపైగా రసాయనాలు ఉంటున్నాయని, తినే తండి, పీల్చే గాలి, ఉండే వాతావరణం పూర్తిగా కలుషితం అయిపోతుండటం ఆందోళనకరమన్నారు. ఈ పరిస్థితిని గమనించి ముందే మేల్కొన్నామని, ప్రకృతి సహజసిద్ధ వ్యవసాయం దిశగా అడుగులువేశామని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో సంప్రదాయేతర వనరులను ఆశ్రయిస్తున్నామని సీఎం వివరించారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని పెద్దఎత్తున చేపట్టామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్‌ను ఏపీలో నెలకొల్పబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇ-రైతు డిజిటల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయడం ఒక విప్లవం అని పేర్కొన్నారు.
మాస్టర్ కార్డ్ నిర్వాహకులు ఎప్పుడు కలిసినా రైతాంగానికి ప్రయోజనకారిగా వుండే సాంకేతికతను తీసుకురావాలని కోరేవాడినని సీఎం గుర్తుచేశారు. ఆర్థిక సాంకేతిక రంగంలో వారు ఉద్దండులని పేర్కొన్నారు. రైతులకు ఉపయోగం ఉండే డిజిటల్ వేదికను వారు పరిచయం చేస్తుండటం గర్వకారణం అన్నారు. ఈ విధానం మొట్ట మొదట ఏపీలోనే ప్రారంభం కావడం మరింత విశేషం అన్నారు. సాగు వివరాలు, ఉత్పత్తుల వివరాలను ‘ఇ-రైతు’ డిజిటల్ మార్కెట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా విక్రయంచుకునే అవకాశం రైతులకు దక్కుతుందన్నారు. రైతులకు మార్గదర్శిగా, సలహాలిచ్చే స్నేహితునిగా ‘ఇ-రైతు’ వుంటుందని చెప్పారు. వ్యవసాయదారులకు ప్రపంచ మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తూ వారికి రెట్టింపు ఆదాయాన్ని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తుందన్నారు.