ఏపీలో రెండో పరిశ్రమ ఏర్పాటుకు నిషా డిజైన్స్ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో నిషా డిజైన్స్ ఎంవోయు కుదుర్చుకుంది. ఎంవోయుపై రాష్ట్రం తరఫున ఈడీబీ సీఈవో కృష్ణ కిషోర్ , నిషా డిజైన్స్ పార్టనర్ సమీర్ గోయంకలు సంతకాలు చేశారు. గార్మెంట్స్ పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఆకర్షణీయంగా ఉన్నాయని సమీర్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో గార్మెంట్స్ పరిశ్రమల ఏర్పాటుకు జరిపిన పరిశీనలలో ఏపీ తమను ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు గార్మెంట్స్ పరిశ్రమలను నెలకొల్పాలని ఒత్తిడి చేసినా కాదని ఏపీని ఎంపిక చేసుకున్నామని తెలిపారు. గార్మెంట్స్ పరిశ్రమ ఏర్పాటుకు ఏపీ అత్యంత సానుకూలమైన ప్రాంతంగా గుర్తించామని తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ "రాష్ట్రం హార్డ్ వేర్ పరిశ్రమ విస్తరణకు అధికప్రాధాన్యమిస్తున్నాము.ఇప్పటికే మొబైల్ పరిశ్రమ దూసుకుపోతోంది, గార్మెంట్స్, టెక్స్ టైల్ పరిశ్రమ ఏర్పాటుకు కూడా ప్రాధాన్యమిస్తున్నామని, గార్మెంట్స్ పరిశ్రమలో మహిళలకు ఉపాధి కల్పించడంలో అధిక ప్రాధాన్యమివ్వాలని, మీరురాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడం సంతోషకరమని, మీతో పని చేయడం ఆనందంగాఉందని", సమీర్ బృందానికి తెలిపారు. అనంతపురం జిల్లా గోరంట్లలో నిషా డిజైన్స్ గార్మెంట్స్ పరిశ్రమను నెలకొల్పనుంది. దేశంలోని ఎనిమిది పరిశ్రమల్లో విదేశీ అవసరాలకు తగ్గట్లుగా నిషా డిజైన్స్ అత్యుత్తమ నాణ్యతతో విలువైన దుస్తులను ఉత్పత్తి చేసి ఎగుమతులు చేస్తోంది. ముఖ్యంగా అమెరికా, ఐరోపా, మిడిల్ ఈస్ట్ దేశాలకు నాణ్యమైన దుస్తుల ఎగుమతులతో మంచి మార్కెట్ ను సాధించింది. రూ.65 కోట్ల వ్యయంతో గోరంట్లలో నిర్మిస్తున్న గార్మెంట్స్ పరిశ్రమలో డిసెంబరుకల్లా ఉత్పత్తి ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబుకు నిషా డిజైన్స్ పార్టనర్ సమీర్ హామీ ఇచ్చారు.
ప్రత్యక్షంగా ఈ పరిశ్రమలో పదిహేను వందల మందికి ఉపాధి కల్పిస్తామని నిషా డిజైన్స్ తెలిపింది. ప్రతి పరిశ్రమలోనూ 80% మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని నిషా డిజైన్స్ పేర్కొంది. అనంతపురం జిల్లా హిందూపూర్ లో నిషా డిజైన్స్ఇప్పటికే మొదటి పరిశ్రమలో ఉత్పత్తి చేస్తోంది. దేశంలో ఎనిమిది పరిశ్రమలకుగాను ఏడు కర్నాటకలో, ఒకటి ఏపీలో నెలకొల్పి గార్మెంట్స్ పరిశ్రమల రంగంలో నిషా డిజైన్స్ కీలక భూమిక వహిస్తోంది. ప్రస్తుతం ఎనిమిది పరిశ్రమల స్థాపన ద్వారా రూ.700 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. ఏపీలో మూడో గార్మెంట్స్ పరిశ్రమను నెలకొల్పడానికి అనంతపురము, చిత్తూరు, విశాఖ, విజయవాడ పరిసర ప్రాంతాలలో భూమి కోసం అన్వేషణ చేస్తున్నామని సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో మూడు పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా పది వేల మందికి ఉపాధి కల్పంచాలన్న లక్ష్యాన్ని నిషా డిజైన్స్ పార్టనర్ సమీర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.పరోక్షంగా ఇరవయి వేలమందికి ఉపాధి కలుగుతుందన్న సమీర్ పేర్కొన్నారు.