బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యా సంచలన రాజకీయ ఆరోపణ చేశారు బ్రిటన్‌కు వెళ్లిపోయేముందు తాను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిసినట్లు వ్యాపారవేత్త విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం వదిలి వెళ్లిపోయే ముందు అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ఆయన్ను చాలా సార్లు కలిసినట్లు పేర్కొన్నారు. మాల్యా కేసు విచారణ జరుగుతున్న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు బయట ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించేందుకు అరుణ్ జైట్లీకి నేను చాలా మార్గాలు చెప్పాను. ఇది నిజం.’’ అని ఆయన విలేకరులతో అన్నారు.
విజయ్‌మాల్యా తాజా వ్యాఖ్యలు దేశంలో రాజకీయ వేడిని పెంచుతున్నాయి. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే దీనిపై కొందమంది నేతలు స్పందించారు. ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి వెళ్లిపోయేందుకు భాజపానే వారికి అవకాశం కల్పిస్తుందని, దీనికి రుజువు విజయ్‌మాల్యా చేసిన తాజా వ్యాఖ్యలేనని ఆరోపిస్తున్నారు. మాల్యా దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రభుత్వం ఎందుకు అవకాశం కల్పించిందో చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ‘‘మాల్యా వ్యాఖ్యలపై ప్రధాని తప్పకుండా స్పందించాలి. దీనిగురించి ఆయనకు తెలియకుండా ఉండే అవకాశం లేదు’’ అని ట్వీట్ చేశారు. అరుణ్ జైట్లీ ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు దాచి ఉంచారని మరో ట్వీట్లో ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వం విజయ్‌మాల్యా వంటి కొందరు బడా వ్యాపారవేత్తలకు మాత్రమే అనుకూలంగా ఉంటోందని గత నెలలో లండన్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మాల్యా దేశం విడిచి వెళ్లాక చాలా మంది భాజపా సీనియర్ నాయకులను కలిశారని, తన వద్ద రుజువులు ఉన్నాయని రాహుల్ లండన్‌లోని విలేకరులతో చెప్పారు. దీనిపై ఫేస్బుక్ వేదికగా స్పందించిన అరుణ్‌జైట్లీ.. విజయ్‌మాల్యా చేసిన ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయని, అవి నిజం కాదని పేర్కొన్నారు. 2014 నుంచి అసలు మాల్యాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు. మాల్యా 2016 మార్చి 2న భారతదేశం నుంచి బ్రిటన్ పారిపోయిన సంగతి తెలిసిందే. ఆయనను తిరిగి భారతదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం బ్రిటన్ కోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసుపై విచారణ తుది దశలో ఉంది.