తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజ మెత్తారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ప్రజలే ముందు’ (పీపుల్ ఫస్ట్) అనేది తెలుగుదేశం పార్టీ నినాదమని ఇందులో భాగంగానే పెట్రోడీజిల్ ధరలు తగ్గించామన్నారు. వేల కోట్ల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ప్రజలకు 11 వందల కోట్ల రూపాయల మేర ప్రయోజనం కల్పించామన్నారు. లీటరుకు రెండు రూపాయలు తగ్గించటం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కలుగుతుందన్నారు.
ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులే కృతజ్ఞతలు తెలిపారన్నారు. కేంద్రం ఆ మాత్రం ఉదారంగా వ్యవహరించక పోవటం దురదృష్టకరమన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజకీయంగా టీడీపీని ఒంటరి చేసేందుకు కుట్ర జరుగుతోందని తెలంగాణలో ఏకపక్షంగా పొత్తులు ఉండవని ప్రకటించిన బీజేపీ రాష్ట్రంలో మాత్రం వైసీపీతో అంటకాగుతోందని విమర్శించారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్‌చేసిన వాళ్లే సమావేశాలకు గైర్హాజరయ్యారని, ఢిల్లీలో మకాం వేస్తామని చెప్పిన నేతలు పత్తాలేరని పరోక్షంగా పవన్‌కల్యాణ్‌పై మండి పడ్డారు. కేంద్రం వైఫల్యాలపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏనాడూ నోరు తెరవరని దుయ్యబట్టారు. నోట్ల రద్దు, పెట్రో డీజిల్ ధరల పెంపు దలపై ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. ప్రజా వ్యతిరేక చర్యలవల్లే ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగిందని స్పష్టం చేశారు.
బీజేపీయేతర పార్టీలు ఏకం కావటాన్ని జగన్ సహించలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్రాల్లో సమర్థనాయకత్వాలు లేకుండా చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని ఎందుకు పూడ్చరని ప్రశ్నించారు. సాయం చేయకపోగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన 50 కోట్లు కూడా వెనక్కు తీసుకున్నారు.. మన ఖాతాలో వేసిన రూ 350 కోట్లు ఎలా మళ్లిస్తారని నిలదీశారు. నాలుగేళ్ల రాష్ట్భ్రావృద్ధి మన కష్టం.. మన తెలివితేటలతోనే సాధించామన్నారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అందుకు అసెంబ్లీ, కౌన్సిల్‌ను వేదికగా ఎంచుకోవాలని ఉద్బోధించారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా గృహనిర్మాణంలో పేదలకు ఎంతో లబ్ధి చేకూర్చామని, ఎస్సీలకు 10 రెట్లు, ఎస్టీలకు 12 రెట్లు మేలు చేశామన్నారు. పట్టణాల్లో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ 4 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు.