ఈ నెల 6 వ తేది నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తన రాజకీయ చరిత్రలో జగన్ లాంటి ప్రతిపక్ష నాయకుడిని చూడలేదని, వైసీపీ అధ్యక్షుడు జగన్ పై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా పారిపోతున్నారని జగన్ పై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. శాసనసభలో శుక్రవారం నదుల అనుసంధానం పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, సభకు హాజరుకాని సభ్యత్వం వృథా.. ప్రతి సమావేశానికి హాజరుకావడం సభ్యుడి ప్రాథమిక బాధ్యతఅని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రతిపక్షం అంటే ప్రజా సమస్యలపై శాసనసభ వేదికగా వచ్చి పోరాడాలి. అలా కాకుండా ఎదో కారణం చూపించి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా పారిపోతున్నారు. బయట రోడ్ల పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకుండా విషం చిమ్ముతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకుండా అడ్డుకునేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) నుంచి సుప్రీంకోర్టు దాకా కేసులు వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదనుకున్నారు. కానీ వేగంగా పూర్తవుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారని, గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అని చంద్రబాబు చెప్పారు.
"పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు పూర్తయితే, రాయలసీమ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలిపోతాయని, ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళతో మీ జిల్లాకు నీళ్లుండవంటూ జగన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలే నాకు మొదటి రెండు ప్రాధాన్యాలని" రైతాంగానికీ, ప్రజా ప్రతినిధులకూ చంద్రబాబు స్పష్టం చేసారు. వైసీపీ ఎలాగూ సభకు రాదని.. బీజేపీ అయినా వస్తుందనుకున్నానని, ఆ రెండు పార్టీలూ ఒక్కటే కదా అని, వ్యవసాయం పై చర్చలో బీజేపీ పాల్గునకపోవటం పై, టీడీపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.
తప్పులు వెదికే భాజపా కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలవరానికి సహకరించే పరిస్థితికి వచ్చిందని పేర్కొన్నారు. ‘భాజపా ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలోనే ఉంటున్నారు. రేపు ఈ నీరే తాగబోతున్నారు. వారికి రాష్ట్ర అభివృద్ధి పై ఆసక్తి ఉంటే నదుల అనుసంధానం పై అసెంబ్లీలో జరిగే చర్చలో పాల్గొని ఉండాలి అన్నారు. అలాగే ఈ నెల 14, 15, 16 తేదీల్లో జలసిరికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాలకు వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి కోరారు. వినాయక చవితి పర్వదినం తర్వాత మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు లేనందున.. నియోజకవర్గాల్లో నీటి వనరుల్లో జల సిరికి హారతిని ఘనంగా నిర్వహించాలన్నారు.