ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు మంత్రి లోకేష్‌లు అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీకి కేంద్రం సహాయం చేస్తోందని, కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. మీడియా సమావేశాలు పెట్టి మరీ ఏపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని నేతలు ఏకరవు పెడుతున్నారు. చంద్రబాబుపై బీజేపీ అగ్గిమీద గుగ్గిలమవుతుంటే.. సోమవారం ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, బాబుపై ప్రశంసలు గుప్పించారు. సీఎం నిర్ణయం భేష్ అంటూ కొనియాడారు. అసెంబ్లీలో ప్రధానంగా పెట్రో ధరల పెంపుపై వాడివేడిగా చర్చ జరిగింది.
‘‘కేంద్రానికి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే మనస్సు లేదా? ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేంద్రానికి కనిపించడం లేదా? పెట్రోల్ ధర పెరగటం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయి. ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే మీరు ఆనందంగా ఉన్నారు. కేంద్రం ప్రజలను మభ్యపెడుతోంది’’ అని చంద్రబాబు మండిపడ్డారు. డీజిల్, పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నును లీటర్‌కు రూ.2 తగ్గిస్తూ అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటించారు. మంగళవారం నుంచి తగ్గింపు ధరలు అమలులోకి రానున్నాయి. పన్నులు తగ్గించడం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.1120 కోట్ల ఆర్ధిక భారం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అయితే చంద్రబాబు నిర్ణయాన్ని విష్ణుకుమార్‌రాజు స్వాగతించారు. పన్ను తగ్గింపుపై నిర్ణయాన్ని అభినందిస్తున్నానని, పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని విష్ణుకుమార్‌రాజు కోరారు. అంతకు ముందు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో తమకు ఏ సంబంధంలేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అసంబ్లీలో మాట్లాడుతూ జగన్ కేసులను కేంద్రం బలహీనపరుస్తుందని, ఇందుకు సాక్ష్యాలు చూపితే రాజీనామా చేస్తారా? అంటూ విష్ణుకుమార్ రాజును ప్రశ్నించారు. మోదీ చేసే రాజకీయం ఇదేనా? అంటూ సీఎం మండిపడ్డారు.