నేను క్రమశిక్షణతో ఉండండి అంటే, నన్ను నియంత అంటున్నారు అని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల పై, చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మీరు చేసిన పనులు క్రమశిక్షణతో చేసినవి కావు, చేతకానితనంతో చేసినవి అంటూ, దుయ్యబట్టారు. ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడం మీ క్రమశిక్షణా అంటూ ప్రశ్నించారు. కేంద్రం తీసుకున్న ఆర్థిక నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టారు. నోట్ల రద్దుతో ఏం సాధించారని కేంద్రాన్ని ప్రశ్నించారు. తాను సూచించిన వాటికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుని ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారని విమర్శించారు. పెట్రోల్ రూ.100కు చేరుతుందేమోనని ఎద్దేవాచేశారు. నీటి ప్రాజెక్టుల అంశంపై సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
‘‘రూపాయి విలువ రోజురోజుకూ పతనమవుతోంది. డాలరుతో రూపాయి మారకం వంద రూపాయలు అవుతుందేమో! పెట్రోల్ ధర కూడా రూ.100కు చేరుతుందేమో. ఎక్కడికి పోతున్నారో అర్థం కావడం లేదు. డీమానిటైజేషన్ చేసి ఏం సాధించారు? అందర్నీ ఇబ్బంది పెట్టడం తప్ప! ఇప్పటికీ ఏటీఎంలలో డబ్బులు దొరకడం లేదు. రూ.2000, రూ. 500 నోట్లు రద్దు చేసి రూ.100, రూ.200 రూపాయల నోట్లను పెట్టండి అని అప్పట్లో కేంద్రానికి సూచించా. డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని చెప్పా. నేను చెప్పినదానికి వాళ్లు రివర్స్ చేశారు. ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడం.. ఆర్థిక క్రమశిక్షణ కాదు.. చేతకానితనం. ఎన్టీఏ ప్రభుత్వం వచ్చాక వృద్ధి ఆగిపోయింది. బ్యాంకులపై ప్రజలకు ఉన్న నమ్మకం పోయింది. స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు పెరిగాయి. బ్యాంకుల్లో ఎన్పీఏలు పెరిగాయి. జగన్‌లాంటి అవినీతి పరులను పక్కన పెట్టుకున్నారు. నీతి, నిజాయతీ గురించి మాట్లాడే అర్హతను ప్రధాని కోల్పోయారు’’ అని చంద్రబాబు విమర్శించారు.
"ఇప్పుడు డిజిటల్ కరెన్సీ వాడకం వెనక్కు వెళ్లిపోయింది. డిజిటల్ కరెన్సీ పెరిగితే అవినీతి తగ్గుతుంది. దానివల్ల దేశం అభివృద్ధి అవుతుంది. కానీ, చేతగాని విధానాలతో ప్రజలను తిప్పలు పెడుతున్నారు. ఇప్పటికీ ఏటీఎంల ముందు పడిగాపులు తప్పడం లేదు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. బ్యాంకులపై విశ్వాసం తగ్గిపోయి డిపాజిట్లు రాని పరిస్థితి నెలకొందని తెలిపారు. అవినీతి తగ్గకపోగా ఇంకా పెరిగిందని, అందుకే ఎగవేతదారులు ధైర్యంగా దేశం విడిచి పారిపోతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో అవినీతిపరులతో కొత్తగా దోస్తీ మొదలు పెట్టారని విమర్శించారు. వారితో దోస్తీ చేస్తూ ఇక అవినీతిపై ఏం పోరాటం చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు.