కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నిన్న విజయవాడ వచ్చింది కొడుకు పెళ్లి సంబంధం కోసమా ? అవును అనే ప్రచారం జరుగుతుంది. ఈ రోజు అన్ని దినపత్రికల్లో ఈ వార్తా ప్రముఖంగా ప్రసారం అయ్యింది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కోడలిగా బెజవాడ అమ్మాయి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. కుమారస్వామి శుక్రవారం ఉదయం విజయవాడ వచ్చారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు అని అధికారికంగా వెల్లడించినా, ఆయన పర్యటన ముఖ్య ఉద్దేశం కొడుకు నిఖిల్ గౌడకు పెళ్లి కుమార్తెను చూడటమేనని తెలిసింది.
విజయవాడకు చెందిన ప్రముఖ షూ కంపెనీ యజమాని కోటేశ్వరరావు కుమార్తెను చూసేందుకు కుమారస్వామి సతీసమేతంగా వచ్చినట్లు చెబుతున్నారు. కుమారస్వామి వెంట మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రఘురామ కృష్ణంరాజు తదితరులు ఉన్నారు. షూ కంపెనీ యజమాని కోటేశ్వరరావు ఇంట్లోనే కుమారస్వామి దంపతులు భోజనం చేశారు. షూ కంపెనీ యజమాని కుమార్తెకు, కుమారస్వామి కొడుకు నిఖిల్‌కు రెండేళ్ల క్రితమే బెంగళూరులో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. దీంతో వీరిద్దరికీ వివాహం చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగా కుమారస్వామి శుక్రవారం కాబోయే కోడలిని చూసుకునేందుకు విజయవాడ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
పెళ్లిచూపుల సమాచారాన్ని ఇరు కుటుంబాలు గోప్యంగా ఉంచాయంటున్నారు. నిన్న బెంగుళూరులో దేవగౌడ చెప్పిన వ్యాఖ్యలు కూడా, ఈ ప్రచారానికి బలాన్ని ఇస్తున్నాయి. శుక్రవారం బెంగళూరులోని పద్మనాభనగర్‌లో మాజీ ప్రధాని దేవేగౌడ నివాసానికి బ్రిటీష్ హైకమిషనర్ డోనాల్డ్ మైక్ అలిస్టర్ వచ్చారు.ఈ సందర్భంగా దేవేగౌడ మీడియాతో మాట్లాడుతూ,కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం విషయంపై అలిస్టర్ తనతో చర్చించారని చెప్పారు. అదే సమయంలో తన తనయుడు, సీఎం కుమారస్వామి, ఆయన సతీమణి అనితా కుమారస్వామి ఏపీలోని విజయవాడకు వెళ్లరని చెప్పారు. ఎందుకు వెళ్లారని మీడియా ప్రశ్నించగా... కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడకు అమ్మాయిని చూసేందుకు వెళ్లారని దేవేగౌడ సమాధానం ఇవ్వడంతో పాటు అందరికీ ఇష్టమైతే పెళ్లి జరిపిస్తామని, ఇది వ్యక్తిగత విషయమని, తాను ఎక్కువగా మాట్లాడనని అన్నారు.