రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని ఆ పార్టీ కుట్రల ట్రాక్ రికార్డు ప్రజలం దరికీ తెలుసని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహా ప్రతివ్యూహాలపై చర్చించేందుకు పార్టీ ముఖ్యనేతలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ విషయం ప్రస్తావించారు. ఏదో విధంగా విద్వేషాలు సృష్టించి అశాంతిని నెలకొల్పాలన్నదే ఆ పార్టీ ప్రయత్నమని మండిపడ్డారు.
నారా హమారా- టీడీపీ హమారా సదస్సు విజయవంతం అవడంతో అక్కసుతో ఆ వర్గానికి చెందిన యువతను కేసుల్లో ఇరికిచ్చేందుకు కుట్రలు చేస్తుందన్నారు. ఇది వైకాపా నేర ప్రవృత్తికి నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో విశాఖ ఎయిర్‌పోర్టులో, కృష్ణా జిల్లా కలెక్టర్‌తో ప్రవర్తించిన సంఘటనలు జగన్ అహంభావానికి నిదర్శనమని, వీటిని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి పెడదోరణిలన్నీ వైకాపా ఆవిర్భావం తరువాతే జరుగుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వైకాపా ప్రజల పట్ల బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తుందని, పార్లమెంట్, అసెంబ్లి సమావేశాలకు హాజరు కాకుండా మత ఘర్షణలు రెచ్చగొట్టే దోరణిలో ఉందని వైకాపాపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఆ పార్టీ నేర పూరిత వ్యవహారాల శైలి ప్రజలందరికీ తెలుసన్నారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండటానికి జగన్ తగడని, రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి పెడధోరణులన్నీ వైసీపీ ఆవిర్భావం తర్వాతే జరుగుతున్నాయని, టీడీపీ కార్యక్రమాల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలని తమ పార్టీ నేతలకు సూచించారు. మేనిఫెస్టోలోని అన్ని హామీలను కేవలం యాభై నెలల్లోనే నెరవేర్చడం ఒక రికార్డుగా చంద్రబాబు అభివర్ణించారు.