Sidebar

12
Mon, May

రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహా ప్రతివ్యూహాలపై చర్చించేందుకు పార్టీ ముఖ్యనేతలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు ఎన్నికల సమరశంఖం పూరించడానికి 5వ తేదీన పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.గుంటూరులో ఇటీవల నిర్వహించిన ముస్లింల సభ విజయవంతం కావడంతో రాజమండ్రిలో త్వరలో బీసీ గర్జన సభ నిర్వహించేందుకు ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తెదేపా సభలకు భంగం కలిగించేందుకు కుట్రలు పన్నుతున్న ప్రతిపక్ష పార్టీ వైకాపా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా చంద్రబాబు నేతలకు హెచ్చరించారు.

cbn 02092018 2

పార్టీ ఆధ్వర్యంలో సదస్సులు, సభలు నిర్వహించేది ఆయా వర్గాలకు చేరువ కావడానికేనని, ఇస్తున్న సందేశం వారికి చేరినప్పుడే ఈ సదస్సులకు సార్ధకత చేకూరుతుందన్నారు. గుంటూరులో నిర్వహించిన నారా హమారా-టీడీపీ హమారా సదస్సు సందేశాన్ని గ్రామగ్రామానికి తీసుకువెళ్ళాలని చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వారికి వివరించి చైతన్యం తీసుకురావాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. నెల్లూరులో నిర్వహించిన దళిత తేజం సదస్సుకూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్సీ కాలనీలకు చేరాలన్నారు. దళితులు, గిరిజనులకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఎన్టీఆర్‌ విదేశీ విద్యా, సబ్‌ప్లాన్‌లకు నిధులు, కార్పొరేషన్‌ ద్వారా చేకూరుతున్న లబ్ధిని వివరించాలన్నారు. త్వరలో బీసీల సదస్సును పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. రాజమండ్రిలో బీసీ గర్జన సభను నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేయగా దానికి అధినేత చంద్రబాబు అంగీకారం తెలిపారు.

బీసీ వర్గాలు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి వెనుముకగా నిలిచారని, ఈ గర్జనసభకు ముందు అన్ని బీసీ కులాల వారితో వేరువేరుగా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని, ఫలాలను సమగ్రంగా చర్చించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాల గురించి ఇప్పటివరకు 5 సదస్సులు నిర్వహించామని, ఇంకా మరో 7 సదస్సులు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. త్వరలో పశ్చిమగోదావరి జిల్లాలో ధర్మ పోరాట సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని నేతలను అధినేత చంద్రబాబు ఆదేశించారు. జనవరి నాటికల్లా మిగిలిన ధర్మ పోరాట సభలను పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. 5 కోట్ల ఆంధ్రుల హక్కుల పరిరక్షణకు టీడీపీ చేస్తున్న పోరాటాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. అదే విధంగా బీజేపీ, వైకాపాల లాలూచీ రాజకీయాలను ఎండగట్టాలని స్పష్టం చేశారు. వీటితో పాటు గిరిజన గర్జన సభను విజయనగరంలో నిర్వహించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఈ సభలన్నింటిని నిర్వహించే తేదీలను త్వరలో తాను ప్రకటిస్తానని అధినేత చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. అదే విధంగా కృష్ణా జిల్లాలో జ్ఞానభేరీ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read