ప్రార్థించే పెదవులకన్నా.. సాయం చేసే చేతులు మిన్న అనే నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఉద్యోగులు నిజం చేసి చూపించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జీవనం చిధ్రమై, బ్రతుకు భారమై కన్నీటి కడలిలో దేవుడా నీవే దిక్కు అంటూ సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ కేరళ వరద బాధితుల దయనీయ దుస్తితి చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఉద్యోగులు చలించిపోయారు. తమవంతుగా కేరళ ప్రజలకు సాయం చేయాలని తలంచారు. ఆలోచన వచ్చిందే తడవుగా పెద్ద మనసుతో తమ సేవా తత్పరతను చాటుకున్నారు.
వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న కేరళ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.51 కోట్లకుపైగా సాయం అందజేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.51.018 కోట్ల నగదు, సహాయ సామగ్రిని మంగళవారం కేరళకు పంపింది. ఇందులో రూ.35 కోట్ల విరాళం కాగా, మిగిలినవి సహాయ సామగ్రి. ఏపీ ఉపముఖ్యమంత్రి చిన రాజప్ప, ఎంపీ రామ్మోహన్ నాయుడు, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి బాబు ఈ సహాయాన్ని బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్‌కి అందజేస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.10 కోట్లు, ఏపీ ఎన్జీఓలు తమ ఒక రోజు వేతనం విరాళంతో ఇచ్చిన .20 కోట్లు, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఒక రోజు వేతనం విరాళంతో ఇచ్చిన రూ.కోటి, పీఐఐసీ నుంచి రూ.17 లక్షల విరాళం, ఆర్టీజీఎస్ ఉద్యోగుల ఒక రోజు వేతనం విరాళంతో ఇచ్చిన రూ.8.09 లక్షలు, పౌరసరఫరాల శాఖ పంపిన రూ.6 కోట్ల విలువైన 2,014 మెట్రిక్ టన్నుల బియ్యం, కృష్ణా జిల్లా నుంచి పంపిన రూ.కోటి విలువైన సామగ్రి, విశాఖపట్నం నుంచి పంపిన రూ.10వేల దుప్పట్లు ఇతరత్రా సహాయ సామగ్రి ఇందులో ఉన్నాయి.