ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, పెను సంచలనం సృష్టించారు. కొందరు ప్రముఖుల మోసాల తీరును వివరిస్తూ ఓ జాబితాను ప్రధాని కార్యాలయానికి అప్పట్లో తాను గవర్నర్ గా వున్న సమయంలో పంపానని, అయినా ఫలితం లేదని, ఎటువంటి చర్యలు తీసుకోలేదని రాజన్ ఆరోపించారు. భాజపా నేత మురళీ మనోహర్ జోషి నేతృత్వంలోని పార్లమెంటరీ సంఘానికి సమర్పించిన నివేదికలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రఘురామ్‌రాజన్.. 2016, సెప్టెంబరు వరకు మూడేళ్ల పాటు రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా పని చేశారు. రుణాలు ఎగవేసి తప్పించుకుంటున్న పెద్ద తిమింగలాల గురించి ప్రధాని కార్యాలయానికి తెలియజేసినా పట్టించుకోలేదని చెప్పారు.
‘‘బ్యాంకులను మోసం చేసే కేసులను ప్రారంభంలోనే గుర్తించేందుకు నేను రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా ఉన్నప్పుడు మోసాల గుర్తింపు విభాగాన్ని ఏర్పాటు చేశాను. ప్రధాని కార్యాలయానికి పెద్ద స్థాయి కేసుల జాబితాను పంపించాను. కనీసం ఒకరిద్దరిపైన అయినా కేసు నమోదు చేసేందుకు సమన్వయంగా పని చేద్దామని విజ్ఞప్తి చేశాను. అయినా ఈ విషయంలో ఎటువంటి పురోగతీ కనిపించలేదు. వాస్తవానికి అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సిన వ్యవహారమిది.’’ అని రఘురామరాజన్ తన నివేదికలో పేర్కొన్నారు. ఒక్క అవినీతిపరుడిపై అయినా ఈ వ్యవస్థ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఒక్కరిపైనైనా కేసు నమోదు చేయలేకపోయింది. దగాలను అడ్డుకోలేకపోయారు.’’ అని రాజన్ చెప్పారు.
భారత్‌లో విద్యుత్తు కొరత ఉందని, అయినా విద్యుత్తు ప్రాజెక్టుల్లో ప్రతిష్టంభన కొనసాగడం చూస్తుంటే ప్రభుత్వం తగినంత వేగంగా నిర్ణయం తీసుకోలేకపోతోందని స్పష్టమవుతోందన్నారు. నిరర్ధక ఆస్తులను గుర్తించడంలో విఫలమయ్యారంటూ తనపై వచ్చిన విమర్శలను రఘురామ్‌రాజన్ తిప్పికొట్టారు. ఈ విమర్శలు హాస్యాస్పదమన్నారు. రఘురామ్‌రాజన్ నివేదికను కాంగ్రెస్ అవకాశంగా మలుచుకుంది. ఆయన ప్రధాని, ప్రధాని కార్యాలయాన్నే తప్పుబట్టారని పేర్కొంది. రుణాలు ఎగవేసిన వారెవరో తెలిసినా ప్రధాని చర్య ఎందుకు తీసుకోలేదని ఆ పార్టీ నేత రణ్‌దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. యూపీఏ అధికారంలోంచి దిగినప్పుడు నిరర్ధక ఆస్తుల విలువ రూ.2.83లక్షల కోట్లేనని, ఇప్పుడు ఎగవేసిన రుణాల విలువ రూ.12లక్షల కోట్లు అని విమర్శించారు.