రాష్ట్ర విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విభజన హామీలు, కేంద్రం వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా భాజపా తీరును ఎండగట్టారు. ప్రధాని మోదీకి ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌పై ఉన్న ప్రేమలో ఏపీపై 5 శాతం ఉన్నా రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి చెందేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర విభజన చట్టంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఏపీపై కక్ష సాధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌కు మేలు చేసే ముంబై-ఢిల్లీ ఇండస్ట్రియల్ కారిడార్‌కు నిధులు గుమ్మరిస్తూ... చెన్నై-విశాఖ కారిడార్‌కు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారన్నారు. తక్కువ వడ్డీకే లభించే జైకా రుణం మొత్తాన్ని ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకే కేటాయించారని... అమరావతి నిర్మాణానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
‘‘అప్పులో ఉన్న గుజరాత్ ఆయిల్ కంపెనీని మోదీ ప్రధాని అయ్యాక హెచ్పీసీఎల్లో విలీనం చేశారు. ఏకంగా రూ.29 వేల కోట్ల సహాయం చేశారు. ఏపీకి సాయం చేయడానికి మాత్రం మనసు రాలేదు. నవ్యాంధ్రలో ఉన్న కేజీ బేసిన్లో వచ్చే లాభాలను... గుజరాత్లో నష్టాలను పూడ్చేందుకు ఉపయోగిస్తారా? పరిశ్రమలకు పన్ను రాయితీలు ఇస్తామని ప్రకటించి అమలుచేయడం లేదు. కొత్త కంపెనీలు పన్ను రాయితీ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇవ్వనే లేదు. విశాఖకు మెట్రో ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు వయొబులిటీ లేదని పక్కనపెడుతున్నారు. రాజధానికి అంతర్జాతీయ విమానాలు నడపమంటే పట్టించుకోవడంలేదు. ఈ నాలుగేళ్లలో రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారానికి ఒక్కసారైతే సమావేశం నిర్వహించారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
"రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి సమస్యల్ని ఎందుకు పరిష్కరించడంలేదు? సోదర రాష్ట్రాలు కలిసుండాలని చెప్పడం మానేసి తగువులు పెట్టాలని చూస్తున్నారు. రాజకీయ సుస్థిరత కోసం అసెంబ్లీ స్థానాలను పెంచమంటే నిర్లక్ష్యం చేశారు. సమస్యల పరిష్కారం కోసం నేను 29 సార్లు దిల్లీకి వెళ్లాను. 90శాతం పూర్తయ్యాయన్నారు కదా.. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎన్ని అయ్యాయో చెప్పండి. ఎవరి చెవిలో పూలు పెడతారు? నిధులు అడిగితే ఎదురుదాడి చేసి కేసులు పెట్టి బెదిరించేందుకు భాజపా యత్నిస్తోంది. హైకోర్టు నిర్మాణానికి సమయం ఉన్నప్పటికీ.. విభజనపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చివరి బడ్జెట్వరకు వేచి చూశాను. ఇచ్చిన హామీలేవీ నెరవేర్చే ఉద్దేశం కేంద్రానికి లేదనే విషయాన్ని గమనించే.. ఇక లాభం లేదనుకొని ఎన్డీయే నుంచి బయటకు వచ్చాం. యూసీలు ఇస్తే ఇవ్వలేదంటున్నారు. రాజధానిలో పనులు ముమ్మరంగా జరుగుతుంటే పనులు మొదలే పెట్టలేదంటారు. అద్భుత రాజధాని నిర్మాణంలో భాగస్వాములవుతామని మోదీ హామీ ఇవ్వలేరా? జగన్‌కు, కేసీఆర్‌కు పరిణతి ఉందని, నాకు పరిణతి లేదని అంటారా?’’ అని చంద్రబాబు మండిపడ్డారు.