రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రవేశపెడుతున్న ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకంలో లబ్ధిదారుల నమోదు ప్రక్రియ ఇప్పటికే అనధికారికంగా మొదలైంది. బుధవారం రాత్రి 9 గంటల సమయానికి 57,151 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియను ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రారంభించనుంది. ఈ వెబ్‌సైట్‌ను పరిశీలనార్థం ఇప్పటికే అందుబాటులోకి తేవడంతో చాలామంది పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇంతవరకు నమోదు చేసుకున్నవారిలో 11,280 మంది ధ్రువీకరణ పత్రాల పరిశీలనా పూర్తి చేసినట్టుగా అందులో పేర్కొన్నారు. 3,714 మంది నుంచి వివిధ ఫిర్యాదులు రాగా, వాటిలో 150 పరిష్కరించినట్టు కూడా ఉంది. ఈ పథకానికి అర్హతలు, అప్‌లోడ్ చేయాల్సిన ధ్రువీకరణ పత్రాల సమాచారాన్నీ ఇందులో పొందుపరిచారు. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో ప్రభుత్వం యాప్‌నూ రూపొందించింది.
నిరాశా నిస్పృహల్లో ఉన్న నిరుద్యోగుల కలల సాకారానికి ముహూర్తం కుదిరింది. ఉపాధి శిక్షణతో పాటు ప్రతినెలా నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా శుక్రవారం యువనేస్తం వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అర్హులకు అక్టోబర్ నుంచి ప్రతినెలా ఆన్‌లైన్‌లో భృతి జమ అవుతుంది. నిరుద్యోగ భృతి అంటే పింఛన్‌లా ప్రతినెలా అందించేది కాకుండా ఉపాధి కల్పనతో పాటు ఉద్యోగాల్లో మెరుగైన పనితీరు కనబరచి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా చేయూతనివ్వటం యువనేస్తం పథకం ముఖ్య ఉద్దేశ్యం. భృతితో ఆర్థికంగా చేయూతనందిస్తూ నైపుణ్యతలో నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది.
రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ చేశారు. అన్ని శాఖల నుంచి వచ్చిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అనుసంధానం చేశారు. ఆధార్ నెంబర్ జోడిస్తే చాలు భృతికి అర్హులవునా, కాదా? అనే విషయం తేలిపోతుంది. యువనేస్తం పోర్టల్ ఒక ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజిలా పనిచేయనుంది. ఇప్పటికే ప్రకటించిన నిబంధనలకు లోబడి నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి యువతకు నెలకు వెయ్యి రూపాయలు చెల్లించనున్నారు.