మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, ఉండవల్లిలోని ఆయాన నివాసంలో కలిసారు. రెండు రోజుల క్రితం సాంబశివరావు గారు, పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన వైసిపీలో చేరుతున్నారు అంటూ, మీడియాలో హడావిడి మొదలైంది. దీని పై వివరణ ఇచ్చేందుకు మాజీ డీజీపీ సాంబశివరావు, చంద్రబాబుని కలిసారని తెలుస్తుంది. వీరిద్దరి మధ్య జరిగిన చర్చల తాలూకూచ వివరాలు తెలియరాలేదు. అయితే, మొన్న జగన్ను కలవడం, ఇప్పుడు చంద్రబాబును సాంబశివరావు కలవడం పట్ల పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం గంగవరం పోర్టు సీఈవో హోదాలో మాజీ డీజీపీ సాంబశివరావు ఉన్నారు. ఈ పదవిలో ఉన్నారు కాబట్టి, ఆయన వచ్చి ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చి ఉంటారని తెలుస్తుంది. సాంబశివరావు వచ్చి జగన్ ను కలిసిన వెంటనే, సాంబశివరావు వైసీపీలో చేరుతున్నట్లు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆయన చేరిక దాదాపు ఖాయం అయ్యిందని, ఆయన పార్టీలో చేరటంతో, మా పార్టీ మరింత బలం పుంజుకుంది అంటూ హడావిడి చేసారు. దీనికి తోడు సాక్షి కూడా, ఆయనకు ఒంగోలు టికెట్ ఇస్తున్నట్టు ప్రచారం చేసారు. అయితే ఈ ప్రచారాన్ని మాజీ డీజీపీ సాంబశివరావు ఖండించారు. తాను వైకాపాలో చేరుతున్నాను అంటూ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనను సాంబశివరావు ఖండించారు. ఆయన చెప్పింది అవాస్తవం అని చెప్పారు.
తాను జగన్ను కలవటంలో రాజకీయ ప్రాధాన్యం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం గంగవరం పోర్టు సీఈవో హోదాలో మర్యాద పూర్వకంగానే జగన్ను కలిశానని వెల్లడించారు. ఆయన్ను ప్రతిపక్ష నేత హోదాలో కలిసాను అని, గతంలో కూడా వైజాగ్ సీపీగా పనిచేసినప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబును కూడా కలిశానని వివరించారు. ఇప్పటికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచలన లేదని, విజయసాయి వ్యాఖ్యలు ఖండిస్తున్నట్టు చెప్పారు. అయితే ఇప్పుడు సాంబశివరావు గారు వచ్చి, చంద్రబాబుకి ఏ వివరణ ఇచ్చారో తెలియాల్సి ఉంది. కర్టసీగానే జగన్ ను కలిసాను అనే వివరణ ఇచ్చి ఉంటారని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, చంద్రబాబుకి, సాంబశివరావు అనే మంచి అభిమానే ముంది. ఆయన జగన్ ను కలవటంతో, అందరూ ఆశ్చర్యపోయారు.