పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రధాని మోదీ కొంప ముంచుతాయని యోగా గురు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం పన్నుల్లో ఉపశమనం కలిగిస్తే.. తాను లీటర్ పెట్రోల్, డీజిల్‌ను కేవలం రూ.35 నుంచి రూ.40కే దేశానికి అందిస్తానని చెప్పారు. ఎన్డీటీవీ యూత్ కాంక్లేవ్ సదస్సులో మాట్లాడిన బాబా రాందేవ్ సమకాలీన అంశాలపై ఆసక్తికరంగా స్పందించారు. పెరుగుతున్న ధరలపై మోదీ ఏదో ఒక చర్య తీసుకోవాలని, లేదంటే ఆయనకు కష్టాలు తప్పవని సూచించారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందికి తీసుకురావాలని, అంతేకాకుండా వాటిని 28 శాతం శ్లాబ్ నుంచి తీసేయాలని బాబా రాందేవ్ సూచించారు.
ఇంధన ధరలతో పాటు ఇతర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పారు. యువతలో నానాటికీ అసహనం పెరిగిపోతోందని రాందేశ్ అన్నారు. అవకాశాలు లేవని వాళ్లు అనుకుంటున్నారని, కానీ అది నిజం కాదని వివరించారు. తనకు గాడ్‌ఫాదర్ ఎవరూ లేరని చెప్పిన రాందేవ్.. అయినా తాను ఈ స్థాయిలో (పతంజలి) ఉన్నానని చెప్పుకొచ్చారు. తాను డబ్బు వెంట పరుగెత్తలేదనీ, డబ్బే తన వెంట నడిచి వస్తోందని చెప్పారు. ప్రధాని మోదీపై కొంత మంది విమర్శలు చేస్తున్నారని, విమర్శలు చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని రాందేవ్ అన్నారు.
అయితే.. మోదీ కొన్ని మంచి పనులు కూడా చేశారని చెప్పారు. రాఫెల్ డీల్‌పై కొన్ని రాజకీయపరమైన ప్రశ్నలు తలెత్తిన మాట వాస్తవమేనని తెలిపారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పిన రాందేవ్.. అన్ని పార్టీలకు సమాన దూరంలో ఉన్నానని తెలిపారు. అయితే మోడీకి సన్నిహితంగా ఉండే రాందేవ్ బాబా, ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యటంతో అందరూ ఆసక్తితో గమనిస్తున్నారు. ఒకప్పుడు, మోడీని ఆకాశానికి ఎత్తిన వాళ్ళే, నెమ్మదిగా ట్యూన్ మార్చుతున్నారు.