వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పై మంత్రి ఆదినారాయణ రెడ్డి శుక్రవారం ఫైర్ అయ్యారు. తమను ఊర కుక్కలు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. జగన్ అనే ఒక సైకో టార్చర్ మేము భరించలేక, మేము పార్టీ నుంచి బయటకు వచ్చామని అని అన్నారు. ఇప్పటికే మా రాజీనామాలు స్పీకర్ పరిధిలో ఉన్నాయని, స్పీకర్ పరిధిలో ఉండగానే, జగన్ కోర్ట్ కి వెళ్ళాడని, కోర్ట్ లో తేలకుండా, ఎవరూ ఏమి చెయ్యలేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది, ప్రజారాజ్యం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు స్టేజి మీద ఉండగానే జగన్ తన పార్టీని ప్రకటించలేదా అని ప్రశ్నించారు.
ఆ రోజే జగన్ మా అందరినీ ఎందుకు రాజీనామా కోరలేదో చెప్పాలని నిలదీశారు. తాము 2014లో వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్ బొమ్మలు పెట్టుకొని గెలిచామని చెబుతున్నారని, మరి అదే బొమ్మ పెట్టుకున్న విజయమ్మ విశాఖపట్నం ఎంపీగా ఎందుకు ఓడిపోయారో చెప్పాలన్నారు. అసలు తల్లిని గెలిపించుకోలేని జగన్ తమను గెలిపించాడని ఎలా అనుకుంటున్నారని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. విశాఖపట్నంలో విజయమ్మ ఓటమికి తాను కారణం అని జగన్ అంగీకరిస్తే మా గెలుపుకు కూడా ఆయనే కారణమని ఒప్పుకుంటామని చెప్పారు. ‘మా వంశ చరిత్ర గురించి నీవు మాట్లాడితే నీ చరిత్ర వందసార్లు చెబుతా.. మేం ఊరకుక్కలమైతే.. నువ్వు ఊరపందివి’ అంటూ జగన్నై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జగన్ ఉదయం లేచినప్పటి నుంచి ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రి అని కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ పెట్టిన నాటి చరిత్ర ఏమిటో చెబితే పారిపోతావని మంత్రి జగన్ను హెచ్చరిస్తూ అన్నారు. తన తండ్రి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు జగన్ ఇంకా పుట్టలేదని ఆదినారాయణ రెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యేగా నీ వద్దకు వచ్చానని, ఆ రోజు ఎమ్మెల్యేల ఫిరాయింపులు గుర్తులేదా? అని జగన్ను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. పార్టీ మారినందుకు తనకు రూ. 20 కోట్లు ఇచ్చారని విమర్శలు చేస్తున్నారని, గతంలో నీ వద్దకు వచ్చినప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చావో చెప్పాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.