ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు, విష్ణుకుమార్ రాజు సెటైర్లతో మొదలైంది.. విష్ణుకుమార్ రాజుకి, యనమల మధ్య జరిగిన సంభాషణతో, అసెంబ్లీలో నవ్వులు పూసాయి. గురువారం ఉదయం ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైన ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సందర్భంగా బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. విశాఖపట్టణంలోని కేజీహెచ్(కింగ్ జార్జ్ హాస్పిటల్)లో ఉన్న పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇంతకు ముందు వైద్యశాఖను మా పార్టీకి చెందిన కామినేని శ్రీనివాసరావుగారు నిర్వహించేవారు. ఇప్పుడు ఆ శాఖను సీఎంగారే నిర్వహిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా మార్పు రావాలి అంటూ విజయకుమార్ రాజు అన్నారు.
"ముఖ్యమంత్రిగారు తరచూ విశాఖపట్టణం వస్తున్నారు. అది మంచిదే. ఒకసారి ఆయన కేజీహెచ్‌ను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది వరకు మా మంత్రిగారు కేజీహెచ్‌లో రాత్రి బస చేశారు. నేను వద్దని చెప్పినా ఆయన వినలేదు. తర్వాత ఆయన పోస్టు పోయింది. అక్కడ ఏదో సెంటిమెంట్ ఉందట. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగారు పడుకోవాల్సిన అవసరం లేదు.. విజిట్ చేస్తే చాలు(నవ్వుతూ). ఆయన కనుక విజిట్ చేస్తే కేజీహెచ్ రూపురేఖలు మారిపోతాయనే నమ్మకం ఉంది. తప్పకుండా కేజీహెచ్ బాగుపడుతుంది.’’ అంటూ విష్ణుకుమార్ రాజు అన్నారు.
అనంతరం ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ‘‘విష్ణుకుమార్ రాజు గారు చాలా వివరంగా చెప్పారు. వాళ్ల మంత్రిగారు వెళ్లి అక్కడ పడుకుంటే ఆయన ఉద్యోగం పోయిందట. ఆయనతో పాటు ఈయన కూడా పడుకుని ఉండాల్సింది.’’ అంటూ సెటైర్ వేశారు. యనమల వేసిన సెటైర్‌కు సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ‘నాకు మంత్రి పదవి ఇవ్వండి పడుకుంటా’ అంటూ విష్ణుకుమార్ రాజు కూడా నవ్వుతూనే స్పందించారు. కేజీహెచ్ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని, ఖాళీగా ఉన్న పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని ఆర్థికమంత్రి యనమల హామీ ఇచ్చారు.