కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి కొత్త చిక్కు వచ్చిపడింది. ఒకవైపు కాంగ్రెస్‌తో కాపురం కలహాలకు దారితీస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కొంతమంది కయ్యానికి కాలు దువ్వుతున్నారు. దీంతో ఈ కాపురాన్ని ఎలా నెట్టుకురావాలో ఆయనకు అర్ధం కావడంలేదు. తమ రాష్ట్రంలో చేపడుతున్న ప్రతి పనిలో వారు అడ్డుపడుతున్నారనీ, పాలన సజావుగా సాగనీయకుండా చికాకులు పెడుతున్నారనీ చంద్రబాబు ముందు కుమారస్వామి ఏకరువుపెట్టారు. ఈ నేపథ్యంలో తనకొక పరిష్కార మార్గం చూపాలని కుమారస్వామి చంద్రబాబును అడిగారట. ఈ అంశమే ఇప్పుడు తెలుగుదేశం అగ్రనేతల్లో చక్కర్లు కొడుతోంది. అసెంబ్లీలో తక్కువ సీట్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే! అయితే కుమారస్వామిని కాంగ్రెస్ నేతలు కుదురుగా ఉండనీయడంలేదు. చీటికీమాటికీ పేచీలకు దిగుతున్నారు.

kumaraswamy 06 092018 2

నీటిపారుదల శాఖ టెండర్లు పిలిస్తే తమ వారికి ఇవ్వాలని వత్తిడి చేస్తున్నారు. కర్ణాటక బడ్జెట్ 2 లక్షల 20 వేలకోట్లు కాగా, సుమారు లక్షా 30 వేల కోట్ల విలువచేసే నీటిపారుదల శాఖ టెండర్లను కుమారస్వామి ప్రభుత్వం పిలిచింది. ఈ టెండర్లను తమవారికి ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు కుంపటి పెట్టారు. రుణమాఫీ విషయంలోనూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నెట్టుకురావడం కుమారస్వామికి సంకటంగా మారింది. ఈ తరుణంలో ఆయన హస్తిన వెళ్లారు. రాహుల్‌గాంధీనికి కలిసి కర్ణాటక కాంగ్రెస్ నేతలను కట్టడిచేయాలంటూ కోరారు. అక్కడినుంచి నేరుగా కుమారస్వామి విజయవాడకు వచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అంతకుముందే కుమారస్వామి చంద్రబాబుని ఫోన్‌లో సంప్రదించారు. ఆయనని కలవాలనుకుంటున్నట్టు చెప్పారు. అప్పటికి తిరుపతి వెళ్లడానికి బాబు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ మార్గమధ్యంలో బందరు రోడ్‌లోని ఓ హోటల్లో బసచేసిన కుమారస్వామిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అప్పటికే అక్కడ మంత్రులు పుల్లారావు, దేవినేని ఉమ, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులున్నారు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కుశల ప్రశ్నలు అడిగి వారు బయటికి వచ్చారు.

kumaraswamy 06 092018 3

అనంతరం కుమారస్వామి, చంద్రబాబు మధ్య సుమారు అరగంట సేపు భేటీ జరిగింది. ఈ సందర్భంగా సంకీర్ణ ప్రభుత్వ నిర్వహణలోని సాధకబాధకాలను కుమారస్వామి ప్రస్తావించారు. కాంగ్రెస్‌తో ప్రస్తుతం ఏర్పడుతున్న కలహాలను పూసగుచ్చారు. యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్‌గా చంద్రబాబు వ్యవహరించినప్పుడు అప్పట్లో ప్రాంతీయ పార్టీలను ఎలా మేనేజ్‌చేశారో అడిగి తెలుసుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య కలహాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనీ, ప్రభుత్వాన్ని పడగొడతామని యడ్యూరప్ప సవాలు చేస్తున్నారనీ కుమారస్వామి బాబుకు చెప్పుకొచ్చారు. ఈ సమస్యలన్నీ విన్న చంద్రబాబు ఆయనకు కొన్ని సలహాలు ఇచ్చారు. సంకీర్ణ ప్రభుత్వ మనుగడకి సయోధ్య ప్రధానమని చంద్రబాబు స్పష్టంచేశారు. ఏదైనా తీవ్ర సమస్య వస్తే... కాంగ్రెస్‌ పెద్దలకి టచ్‌లో ఉండి వారికి నివేదించాలనీ, అవసరమైతే హస్తినలోని ఆ పార్టీ హైకమాండ్‌తో సంప్రదింపులు జరపాలనీ కుమారస్వామికి సూచించారు. కర్ణాటకలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడటం వలన దేశంలో ఎన్‌డీఏకి ప్రత్యామ్నయంపై అందరిలో ఆసక్తి పెరిగిందని ఏపీ సీఎం వివరించారు. ప్రాంతీయ పార్టీలు తమ మధ్య విభేదాలను మరిచి ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని భావసారూప్యత కలిగిన నేతలంతా మాట్లాడుతున్నారని బాబు గుర్తుచేశారు. ఇలాంటి కీలక తరుణంలో కర్ణాటకలో సంకీర్ణ ధర్మం పాటిస్తూ ముందుకు సాగడమే మంచిదని చంద్రబాబు హితవుచెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read