పశ్చిమగోదావరి జిల్లాలో ఆచంట నియోజకవర్గం ఎంతో కీలకమైన స్థానం. జిల్లాలోని ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఎస్సీ, బీసీ సామాజికవర్గాల ఓటర్లు ఇక్కడ అధికంగా ఉన్నారు. గతంలో ఈ సెగ్మెంట్ ఎస్సీ రిజర్వుడు కాగా, 2009లో జనరల్ కేటగిరీగా మారింది. అవడానికి జనరల్ కేటగిరీ సీట్ అయినా, ప్రధాన పార్టీలు బీసీలకే టిక్కెట్ ఇవ్వడానికి మొగ్గుచూపుతాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన సిటింగ్ ఎమ్మెల్యే, మంత్రి పితాని సత్యనారాయణ కూడా బీసీ కేటగిరీకి చెందిన నాయకుడే. అటువంటి ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది. మూడు నెలల క్రితం కొత్తగా నియోజకవర్గ కన్వీనర్‌గా నియమితులైన చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఈ పరిణామానికి కారకులని వైసీపీ శ్రేణులు వేలెత్తిచూపుతున్నాయి.
అసెంబ్లీ టిక్కెట్ కూడా దాదాపు ఆయనకే ఖరారు కావడంతో.. మిగిలిన నాయకుల్లో కూసింత జెలసీ ఏర్పడిందట. ఎప్పటినుంచో పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న తమకు కోకుండా.. మధ్యలో వచ్చి సీటు ఎగరేసుకుపోతున్నారని ఆయనపట్ల మిగిలిన వారిలో కొంత అసూయ ఏర్పడిందట. ఈ సంగతులే ఇప్పుడు ఆచంటలో చర్చోపచర్చలకు దారితీస్తున్నాయి. రాజకీయంగా తటస్థంగా ఉన్న రంగనాథరాజు తనకు టిక్కెట్ కన్ఫర్మ్ చేస్తేనే పార్టీలోకి వస్తానని తెగేసిచెప్పడంతో పార్టీ అధినేత జగన్ తలూపారట. అలా ఆయన ఆచంట నియోజకవర్గ కన్వీనర్‌గా నియమితులయ్యారట.
శ్రీరంగనాథరాజుకి కన్వీనర్ పదవి కట్టబెట్టిన అనంతరం ఆచంట వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయట. నియోజకవర్గంలో కీలక ఓటర్లుగా ఉన్న ఎస్సీ నాయకుల ప్రయోజనాలను ఆయన పట్టించుకోవడం మానేశారట. అంతేకాదు, కొంతమంది ఎస్సీ నేతలు ఏర్పాటుచేసిన కార్యక్రమాలకు శ్రీరంగనాథరాజు గైర్హాజరయ్యారట. దాంతో ఆ సామాజికవర్గ నేతలు ఆయనపై ఒకింత గుర్రుగా ఉన్నారట. మరోపక్క ఇతర వర్గాల నాయకులు కూడా ఆయనపై కొంత అక్కసును వెళ్లగక్కుతున్నారట. ఇదంతా ఒక ఎత్తయితే.. ఉద్దేశపూర్వకంగానే కొందరు నేతలు శ్రీరంగనాథరాజుకు ఎడమొహం- పెడమొహంగా ఉంటున్నారనే ప్రచారమూ జరుగుతోంది. మరి ఈ పరిణామాల పట్ల వైకాపా పెద్దలు ఎలా స్పందిస్తారో, స్థానిక రాజకీయాన్ని ఎలా చక్కబెడతారో వేచిచూడాలి.