ఎన్నికల సన్నాహక చర్యల్లో మిగతా పార్టీల కంటే ముందున్న అధికార పార్టీ టిడిపి ఇక ఇప్పుడు గల్లంతు అయిన ఓట్ల పై దృష్తి పెట్టింది. గత కొన్ని రోజులుగా, పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు అవుతున్నాయనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టిడిపి, ఓటర్ల నమోదు ప్రక్రియ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కొత్త ఓటర్ల నమోదు, చిరునామాల మార్పు తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని బూత్ కన్వీనర్లకు పార్టీ అధిష్టానం సూచనలు చేసినట్లు తెలిసింది. ఓటర్ల నమోదు పై కాల్ సెంటర్ ద్వారా ప్రతి ఒక్కరినీ యాక్టివేట్ చేయాలని బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం చేసిన టిడిపి అధిష్టానం ఈ ప్రకియ పై పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత శ్రద్ద వహించాలని మార్గనిర్దేశం చేసింది. అలాగే బూత్‌ల వారీగా పార్టీ పురోగతిపై ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు సైతం జారీ చేసినట్లు సమాచారం.
అంతేకాకుండా ఆయా ప్రాంతాలకు చెందిన బూత్ కన్వీనర్లను పార్టీ ఏ మేరకు పుంజుకుందనే అంశం పై వారంలో ఒక రోజు తప్పనిసరిగా మానిటరింగ్ చేసి అధిష్టానానికి నివేదిక పంపాల్సి ఉంటుందని తమకు ఆదేశాలు అందినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. ఎన్నికలలో ప్రతి ఓటు కీలకమే కాబట్టి ఒక్క ఓటు విషయంలోనైనా అలసత్వం పనికిరాదని టిడిపి అధిష్టానం పార్టీ శ్రేణులను అప్రమప్తం చేస్తోంది. అలాగే వలస ఓటర్లు వారి ఓట్లు అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశముంటుందని అధికారపార్టీ అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 40వేల మంది బూత్ కన్వీనర్లు ఉండగా ఇందులో ఇప్పటి వరకు 18,800 మంది శిక్షణ పూర్తి చేసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా రాజకీయ పరిణామాలపై గ్రామాల్లో జరిగే చర్చల్లో బూత్ కన్వీనర్లు పార్టీ వాణిని గట్టిగా వినిపించాలని సీనియర్ పార్టీ నేతలు దిగువ స్థాయి క్యాడర్‌కు సలహాలు సూచనలు చేసినట్లు పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. అలాగే టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు బూత్ కన్వీనర్లు, సేవా మిత్రలు కృషి చేయాలని సిఎం చంద్రబాబు తరచుగా నిర్వహిస్తున్న పార్టీ అంతర్గత సమావేశాల్లో శ్రేణులను పదే పదే హెచ్చరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రతిపక్షాల కుట్రల్ని గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు, కన్వీనర్లు తిప్పి కొట్టాలని, అవసరమైతే జిల్లా పార్టీ నేతల సహకారం తీసుకోవాలని టిడిపి అధిష్టానం పార్టీ క్యాడర్‌కు సూచనలు చేసింది. వైసిపి, బిజెపి కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నాయనే విషయాన్ని, గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.