ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభయ్యాయి. సమావేశాలకు హాజరయ్యే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అయితే అసెంబ్లీ సమావేశాల తొలిరోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించే విషయంలో తెలుగుదేశం ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను విస్మరించారు. ఉభయసభల్లో దాదాపు 160మంది ప్రాతినిథ్యం వహిస్తుండగా ఈరోజు అన్నగారికి వెంకటపాలెంలో సీఎం నివాళులు అర్పించేటప్పుడు పట్టుమని 15మంది కూడా లేరు. హైదరాబాద్‌లో సమావేశాలు జరిగినప్పుడు ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన సమాధికి నివాళులు అర్పించి తర్వాతే సభకు వెళ్లడం ఆనవాయితీగా ఉండేది.
అసెంబ్లీ అమరావతికి మారాక వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తొలిరోజు నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్లడం సీఎం ఆనవాయితీగా పెట్టుకోవడంతో ప్రజాప్రతినిధులూ ఆయన్ని అనుసరిస్తున్నారు. అయితే ఈరోజు అసెంబ్లీకి వెళ్లే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించే సమయంలో నేతల హాజరు తక్కువగా ఉంది. దీంతో నేతలు పదవులు పొందాక బాధ్యతలు విస్మరిస్తున్నాయనే గుసగుసలు గ్రామస్థుల నుంచి వినిపించాయి. కాగా, ఈ కార్యక్రమానికి గైర్హాజరైన ప్రజాప్రతినిధులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు పొందాక బాధ్యతలు విస్మరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రితో పాటు మంత్రులు లోకేశ్, దేవినేని, జవహర్, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు యామినీబాల, రాధాకృష్ణ, చాంద్‌బాషా, మాధవనాయుడు, శ్రవణ్‌కుమార్, గణబాబు, పీలా గోవింద్, మాధవవాయుడు, ఎమ్మెల్సీలు కరణం బలరాం, గౌరుగాని శ్రీనివాస్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, టీడీ జనార్దన్ మాత్రమే సీఎం వెంట వచ్చి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సభ్యులు గైర్హాజరవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి ఇచ్చే గౌరవం ఇది కాదని అసహనం వ్యక్తం చేశారు.