ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, కేంద్రంలో బీజేపీ పెద్దలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం. మా రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అని అడుగుతున్నందుకు, ఇప్పటికే అనేక విధాలుగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టటమే కాకుండా, వ్యక్తిగతంగా చంద్రబాబుని కూడా టార్గెట్ చేసారు. గత ఆరు నెలల నుంచి, మీకు చుక్కలు చూపిస్తాం అంటాడు ఒకడు, మిమ్మల్ని జైల్లో పెడతాం అంటాడు ఒకడు, మీ పై సిబిఐ, ఈడీని పంపిస్తున్నాం అంటాడు మరొకడు. ఆ జీవీఎల్ అయితే, వారానికి ఒకసారి ఢిల్లీ నుంచి వచ్చి, ఎదో చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఏది దొరకక, ఎప్పుడో ఎనిమిది ఏళ్ళ నాటి కేసు పై నోటీసులు ఇచ్చారు.
ఇన్ని విధాలుగా చంద్రబాబుని ఇబ్బంది పెడుతూ, చివరకు ఎప్పుడో మూసేసిన కేసులో, చంద్రబాబుకి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. దీని వెనుక ఎవరు ఉన్నారో, అందరికీ తెలిసిందే. ఈ కేసు పై చంద్రబాబు కూడా అసెంబ్లీలో మాట్లాడారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యల పై మాట్లాడుతూ, చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అయితే, ఇప్పుడు చంద్రబాబు మాట్లాడిన మాటలు కూడా, లీగల్ తీసుకుని, మళ్ళీ చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్లాన్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మహారాష్ట్ర న్యాయస్థానంలో ‘కోర్టు ధిక్కార’ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. బాబ్లీ వ్యవహారంలో న్యాయవ్యవస్థను కించపరిచేలా సీఎం వ్యాఖ్యానించారని జీవీఎల్ ఆరోపించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఈ పిటిషన్ సిద్ధమవుతోందని చెప్పారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కోర్టులపై చంద్రబాబు, టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను న్యాయ నిపుణులకు చూపించామన్నారు. అలాగే ఏపీ అసెంబ్లీలో సీఎం పై సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడతామని జీవీఎల్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన చెప్పారు. ఇటు హక్కుల తీర్మానం అటు కోర్టు ధిక్కార పిటిషన్‌తో చంద్రబాబును ఇరుకున పెడతామన్నారు. కాగా, ముంబై హైకోర్టులో సీఎం చంద్రబాబుపై పిల్ వేయబోతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెనాలిలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.