అసెంబ్లీ సమావేశాల్లో మొబైల్ ఫోన్లు లోపలకి తీసుకురాకూడదు అనే నిబంధన ఉంది. ఈ నిబంధనలు అందరూ పాటిస్తారు కూడా. అసెంబ్లీ హాల్ లోకి వచ్చేప్పుడు, మొబైల్ ఫోన్ బయట ఇచ్చి, సమావేశాల్లో పాల్గుంటారు. అయితే నిన్న మాత్రం, పొరపాటు జరిగింది. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సెల్ ఫోన్ రింగయింది. ఈ సమయంలో స్పీకర్ కొంత అసహనానికి గురయ్యారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు ఫోన్లు బయటపెట్టి రావాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు శాసనసభ్యులకు సూచించారు.
ఈ సంఘటన జరిగిన వెంటనే, వెలగపూడి రామకృష్ణబాబులేవనెత్తిన అంశమే చర్చకు రావడంతో ఆయన మాట్లాడేందుకు లేచారు. ఈ సందర్భంగా, స్పీకర్‌కు క్షమాపణ చెప్పారు. పొరపాటున మర్చిపోయి వచ్చేసానని, మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను అంటూ, సభకు క్షమాపణ చెప్పారు. మరో పక్క విశాఖపట్నం జిల్లాలోని పంచగ్రామాల భూముల సమస్య పై నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. పంచగ్రామాల భూముల సమస్య సత్వర పరిష్కా రానికి త్వరలో స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులతో ఒక సమావేశాన్ని నిర్వహించ నున్నట్లు ఉపముఖ్యమంత్రి కె.ఇ కృష్ణమూర్తి తెలిపారు.
ప్రజాప్రాముఖ్యత గల అంశంగా ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు శాసనసభలో మంగళవారం ప్రభుత్వం దృష్టికి తెసుకురావడంతో మంత్రి సమాధానమిస్తూ...ఈ భూములపై సింహాచలం దేవస్థానానికి, స్థానికులకు మధ్య న్యాయస్థానంలో కేసు నడుస్తోందని, తీర్పు వచ్చిన అంనతరం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఇళ్లకు సంబంధించిన విషయం న్యాయస్థానంలో ఉందని, వ్యవసాయ భూముల అంశాన్ని రెవెన్యూ కోర్టులోనే తేల్చుకోవాలని గతంలో న్యాయస్థానం సూచించినా ఇంత వరకూ పరిష్కారం కాలేదని మంత్రి దృష్టికి తెచ్చారు. జెసి, ఆర్డీఒల నుంచి సమాచారం తీసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సమాధానమిచ్చారు. ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి.శ్రీనివాసరావు, కన్నబాబు స్థానికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.